టీమిండియా వరల్డ్ రికార్డ్
ముంబై, జూలై 21,
అసాధారణ పోరాటంతో శ్రీలంకపై రెండో వన్డే గెలిచిన టీమిండియా.. కొన్ని రికార్డులను తన పేరిట రాసుకుంది. ఈ విజయంతో సిరీస్‌ను కూడా టీమిండియా గెలుచుకుంది. ఇది ఆ టీమ్‌పై ఇండియాకు వరుసగా పదో విజయం కాగా వరుసగా తొమ్మిదో సిరీస్ విజయం. అయితే వీటిని మించిన వరల్డ్ రికార్డ్ ఒకటి ఈ విజయంతో ఇండియా అందుకుంది. ఇది శ్రీలంకపై టీమిండియా సాధించిన 93వ విజయం.ఈ గెలుపుతో ఇన్నాళ్లూ ఆస్ట్రేలియా పేరిట ఉన్న ప్రపంచ రికార్డును టీమిండియా సొంతం చేసుకుంది. ఇప్పటి వరకూ వన్డే క్రికెట్‌లో ఏ టీమ్ కూడా ఏ ప్రత్యర్థిపైనా ఇన్ని విజయాలు సాధించలేదు. ఇన్నాళ్లూ న్యూజిలాండ్‌పై 92 విజయాలతో ఆస్ట్రేలియా టాప్‌లో ఉంది.ఇక వ్యక్తిగత రికార్డుల విషయానికి వస్తే దీపక్ చహర్ చేసిన 69 పరుగులు ఇండియా తరఫున ఎనిమిదవ నంబర్ బ్యాట్స్‌మన్ చేసిన రెండో అత్యధిక పరుగులు కావడం విశేషం. అతని కంటే ముందు 2019 వరల్డ్‌కప్ సెమీఫైనల్లో రవీంద్ర జడేజా ఇదే స్థానంలో వచ్చి 77 పరుగులు చేశాడు. ఇక భువనేశ్వర్‌తో కలిసి దీపక్ చహర్ నెలకొల్పిన 84 పరుగుల భాగస్వామ్యం.. 8వ వికెట్‌కు ఇండియా తరఫున రెండో అత్యధిక పార్ట్‌నర్‌షిప్. 2017లో భువనేశ్వరే ధోనీతో కలిసి శ్రీలంకపైనే 8వ వికెట్‌కు 100 పరుగుల పార్ట్‌నర్‌షిప్ నెలకొల్పాడు.