అమరీందర్ వర్సెస్ సిద్ధూ
ఛండీఘడ్, జూలై 21,
పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కొత్త చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ మధ్య విభేదాలు మరింత తారాస్థాయికి చేరినట్లు కనిపిస్తున్నది. తనకు మద్దతుగా ఉన్న 62 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సిద్ధూ బుధవారం అమృత్‌సర్‌లోని తన నివాసంలో అల్పాహారానికి ఆహ్వానించారు. వారితో భేటీ అనంతరం అంతా కలిసి ఒక బస్సులో గోల్డెన్ టెంపుల్‌తోపాటు పలు ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించారు.
సిద్ధూ బల ప్రదర్శన.. 62 మంది ఎమ్మెల్యేలతో భేటీ
ఈ సందర్భంగా సిద్ధూకు అనుకూలంగా పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడారు. సిద్ధూ క్షమాపణ చెప్పాలన్న సీఎం అమరీందర్ సింగ్ సలహాదారుడి ట్వీట్‌ను కాంగ్రెస్ జలందర్ కంటోన్‌మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రగత్ సింగ్ ఖండించారు. సిద్ధూ ఎందుకు క్షమాపణ చెప్పాలి అని ఆయన ప్రశ్నించారు. చాలా సమస్యలు పరిష్కరించని సీఎం అమరీందర్ సింగ్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని అన్నారు. సీఎంను ఆయన సలహాదారుడు తప్పుదారి పట్టిస్తున్నారని కొందరు ఎమ్మెల్యేలు విమర్శించారు. వచ్చే ఏడాది జరుగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ సిద్ధూ నేతృత్వంలో పార్టీ తప్పక విజయం సాధిస్తుందని కొందరు ఎమ్మెల్యేలు ధీమా వ్యక్తం చేశారు.