బిట్ శాట్ కోసం ఎంసెట్ లో మార్పులు
విజయవాడ, జూలై 21,
టీఎస్ ఎంసెట్, బిట్ శాట్ ( BITSAT ) ప్రవేశ పరీక్షలు ఈ ఏడాది ఒకే సమయంలో నిర్వహించనున్నారు. దీంతో బిట్‌శాట్ రాసే విద్యార్థులు ఎంసెట్ పరీక్షల తేదీని మార్చుకునేందుకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి అవకాశం కల్పించింది. ఆగస్టు 4 నుంచి 6వ తేదీ వరకు ఎంసెట్ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆగస్టు 3 నుంచి 9 వరకు బిట్‌శాట్ పరీక్షలు కూడా జరగనున్నాయి. ఈ రెండు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఎంసెట్ తేదీని మార్చుకోవచ్చు అని అధికారులు తెలిపారు. ఉదాహరణకు ఒక విద్యార్థికి ఆగస్టు 5వ తేదీనే రెండు పరీక్షలు ఉన్నాయనుకుంటే.. ఎంసెట్ తేదీని ఆగస్టు 4వ తేదీ కన్నా లేదా 6వ తేదీ కన్నా మార్చుకోవచ్చు. ఇలాంటి విద్యార్థులు ఎంసెట్ కన్వీనర్‌కు తమ అభ్యర్థనను మెయిల్ చేయొచ్చు. దాని ఆధారంగా పరీక్ష తేదీల్లో మార్పు చేస్తారు. మెయిల్ convener.eamcet@tsche.ac.in.ఈ ఏడాది ఇంజినీరింగ్ స్ర్టీమ్‌కు 1,63,644 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. అగ్రికల్చర్, మెడికల్ స్ర్టీమ్‌కు 85,692 మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. గతేడాది 2,21,706 మంది దరఖాస్తు చేసుకోగా.. ఈ ఏడాది ఆ సంఖ్య 2,49,336కు చేరింది.