ఆగస్టు 15న టీటీడీ అగరబత్తుల విడుదలకు చర్యలు తీసుకోండి
టీటీడీ ఈవో
తిరుపతి, జూలై 21,
టీటీడీ ఆలయాల్లో ఉపయోగించిన పూలమాలలతో తయారు చేసే అగర బత్తుల అమ్మకాలు ఆగస్టు 15 వ తేదీ ప్రారంభించడానికి ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. టీటీడీ పరిపాలన భవనంలోని తన చాంబర్లో బుధవారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు.
దర్శన్ ఇంటర్నేషనల్ సంస్థ ముడి సరుకు ఖర్చు మాత్రమే తీసుకుని, అగర బత్తులు తయారుచేసి టీటీడీకి ఇస్తుందన్నారు. వీటికి ఎంఆర్ పి నిర్ణయించి అమ్మకాలు జరిపేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. మొదటి విడతగా తిరుమల లడ్డూ కౌంటర్ల వద్ద ఆగస్టు 15న అమ్మకాలు ప్రారంభించి, తరువాత ఇతర ప్రాంతాల్లో విక్రయాలకు ఏర్పాట్లు చేయాలన్నారు.
పంచ గవ్య తోటి తయారు చేయాలని నిర్ణయించిన 15 రకాల ఉత్పత్తుల గురించి ఈవో అధికారులతో చర్చించారు. వీటిని త్వరలోనే విడుదల చేయడానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. టీటీడీ ఆయుర్వేద ఫార్మసీని బలోపేతం చేసి మరిన్ని ఉత్పత్తులు తయారు చేయడంపై అధికారులతో చర్చించారు. ఇప్పటికే 115 రకాల ఉత్పత్తులకు ఆయుష్ మంత్రిత్వశాఖ నుంచి లైసెన్స్ తీసుకున్నామని అధికారులు తెలిపారు. మరో 70 ఉత్పత్తుల తయారీకి లైసెన్స్ తీసుకునే ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని ఈవో ఆదేశించారు. ఫార్మసీ ఆధునీకరణ పనులు త్వరగా పూర్తి చేసి, అవసరమైన కొత్త యంత్రాలు సమీకరించుకోవడానికి ఈ నెలాఖరుకు టెండర్లు పూర్తి చేయాలని ఈవో ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.