తిరుపతి, జూలై 23,
తిరుమల శ్రీవారితోనే ఆటలు ఆడుతున్నారు కొందరు డబ్బు పిచ్చోళ్లు. శ్రీవారి లడ్డుతోనే వ్యాపారం చేసేందుకు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. పవిత్రమైన తిరుమల కొండను కూడా యాప్‌ల పేరిట డబ్బులు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు కొందరు కాసులకక్కుర్తిగాళ్లు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా తాజాగా ఓ సంస్థ ఓ యాప్‌ను విడుదలచేసింది. తిరుమల కొండపై బస్సు ప్రయాణం పేరిట విడుదలైన ఈ యాప్ ప్రస్తుతం వివాదాస్పదం అవుతోంది. తిరుమల ఘాట్ రోడ్డులో ప్రయాణం చేసే విధంగా ఈ యాప్‌ను తయారుచేశారు. అలిపిరి గరుడ విగ్రహం నుంచి కొండపైకి.. తిరిగి తిరుపతికి ఘాట్ రోడ్డులో ప్రయాణించేలా గేమ్ డిజైన్ చేశారు. కొండపైకి బస్సు ప్రయాణం పేరిట విడుదలైన ఈ గేమ్ ఆడటానికి ఉన్న నిబంధనలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. కొండపైకి ఘాట్ రోడ్డులో ప్రయాణించాలంటే 20 లడ్డులు కొనాలన్న నిబంధన పలు విమర్శలకు తావిస్తోంది. ఒక్క గేమ్ ఆడటానికి 179 రూపాయలతో లడ్డులు కొనేలా ఆన్‌లైన్‌లో డబ్బులు వసూలు చేస్తోన్నారు యాప్ నిర్వహకులు. ఏడుకొండల్లో ప్రయాణం గేమ్ యాప్ పై తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు బీజేపీ నేతలు. గేమ్‌లో శ్రీవారి శ్లోకాలు వాడటంపైనా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గేమ్‌ను రూపొందించిన నిర్వాహకులను అరెస్ట్ చేయాలని బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. టెక్ మేడ్స్ సంస్థకు చెందిన సురేశ్ కుమార్..ఏడాది కాలం పాటు..కష్టపడి గేమ్ రూపొందించినట్లు తెలుస్తోంది. గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులోకి వచ్చింది. తిరుమల శ్రీవారి కొండలు, బస్సు ప్రయాణం..వర్చువల్ విధానం ద్వారా లడ్డూలు కొనాలని నిబంధన పెట్టారు. గేమ్ ఆడే వారంతా..బస్సు డ్రైవర్ గా వ్యవహరించాల్సి ఉంటుంది. గేమ్ ఆడుతున్న సమయంలో…బ్యాక్ గ్రౌండ్ లో శ్రీవారి శ్లోకాలు వినిపిస్తుండడంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. విజిలెన్స్ అధికారులకు తెలిసి…టెక్ మేడ్స్ సంస్థలో సోదాలు నిర్వహించారు. యాప్ డిజైనర్, ఎండీ సురేశ్ కుమార్ ను ప్రశ్నించారు. తాను ఎవరి మనోభావాలు కించపరచలేదని చెప్పారు. శ్రీవారి లడ్డూల కొనుగోలు ప్రస్తావన, స్వామి వారి సంకీర్తల ప్రస్తావన తీవ్ర అభ్యంతకరమైందని టీటీడీ విజిలెన్స్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో సురేశ్ కుమార్ వెంటనే ప్లే స్టోర్ నుంచి యాప్ డిలీట్ చేశారు. కార్యాలయాన్ని మూసివేసి అతను కనిపించకుండా పోయాడు. గేమ్ లో శ్రీవారి లడ్డూలు, శ్లోకాల ప్రస్తావన అభ్యంతరకరంగా ఉందని..భక్తుల మనోభావాలు కించపరిచేలా ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.