YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ముంపుపై కనిపించని ముందు చూపు

ముంపుపై కనిపించని ముందు చూపు

రాజమండ్రి, జూలై 23, 
గోదావరి ముంపుపై సర్కారుకు ముందు చూపు కరువైంది. పోలవరం కాఫర్‌ డ్యాం నిర్మాణ దశలో ఉండగానే గతేడాది వరదలకు అధికారుల అంచనాలకు మించి గ్రామాలు ముంపునకు గురవడంతో మొదటి కాంటూర్‌ పరిధి (41.15 మీటర్లు) లెక్కలన్నీ కాకి లెక్కలని తేలిపోయాయి. ప్రస్తుతం కాఫర్‌ డ్యాం పనులు దాదాపు పూర్తి కావడంతో బ్యాక్‌ వాటర్‌ ప్రభావంతో ముంపు ప్రమాదం నాలుగు రెట్లు పెరిగింది. భద్రాచలం వద్ద ప్రస్తుతం నమోదవుతోన్న 13.20 అడుగుల నీటిమట్టానికే దేవీపట్నం జలదిగ్బంధమైంది. ఆ లెక్కన మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి అంటే, 43 అడుగులకు చేరే సరికి అధికారుల అంచనాలను దాటి ముంపునకు గురయ్యే ప్రమాదం స్పష్టంగా కన్పిస్తోంది. ఈ నేపథ్యంలో ముందస్తుగా పక్కా ప్రణాళికలు రూపొందించి ముంపు బాధితులను రక్షించాల్సిన ప్రభుత్వ తాత్సారం చేస్తుండడంతో పోలవరం నిర్వాసితులు తీవ్ర ఆందోళనతో ఉన్నారు.మొదటి కాంటూర్‌ పరిధికి మించి గతేడాది గ్రామాలు ముంపు బారిన పడడంతో తాజా అంచనాలు రూపొందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ముంపు గ్రామాలను గుర్తించేందుకు ఏరియల్‌ సర్వే నిర్వహిస్తున్నారు. గ్రౌండ్‌ లెవెల్‌లో పాయింట్లను ఏర్పాటు చేసినట్టు సమాచారం. ఈ సర్వే ఆధారంగా గుర్తించిన గ్రామాలను గత జాబితాలో పోల్చి తుది నివేదిక రూపొందించనున్నారు. ప్రస్తుతం ప్రాథమిక దశలో ఉన్న ఈ సర్వే పూర్తయ్యే సరికి రెండు నెలలు సమయం పట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈలోగా వరదలు వచ్చే అవకాశం ఉంది.పోలవరం ప్రాజెక్టు కింద ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన ఎనిమిది మండలాల్లోని 373 గ్రామాల్లోని 1,05,601 కుటుంబాలు నిర్వాసితులవుతాయని అధికారులు అంచనా వేశారు. గతేడాది వరదలకు తూర్పుగోదావరి జిల్లాలో మొదటి కాంటూర్‌ 41.15 మీటర్ల పరిధిలోనిలేని గ్రామాలు సైతం ముంపు బారిన పడ్డాయి. కూనవరం మండలంలోని బజ్జరాయగూడెం మొదటి కాంటూర్‌ పరిధిలో ఉంది. ఈ పరిధిలోలేని టేకులబోరు, కూనవరం, శబరి కొత్తగూడెంతో పాటు 25 గ్రామాలు మునిగిపోయాయి. విఆర్‌పురం మండలంలోని 19 గ్రామాలను మొదటి కాంటూర్‌ పరిధిలో చేర్చారు. ఈ పరిధిలోలేని మరో 20 గ్రామాలకుపైగా నీటమునిగాయి. చింతూరు మండలంలోని నిర్వాసిత గ్రామాలను అసలు మొదటి కాంటూర్‌ పరిధిలో చేర్చలేదు. గతేడాది వరదలకు మండల కేంద్రంతో పాటు 20 గ్రామాలు ముంపుబారిన పడ్డాయి.మొదటి కాంటూర్‌ పరిధిలోని గ్రామాలు ముందుగా మునిగిపోతాయని, కాబట్టి ఆ గ్రామస్తులకు తొలుత పునరావాసం కల్పిస్తామని ప్రభుత్వం చెప్పుకొచ్చింది. జిల్లాలోని దేవీపట్నం మండలంలో తొలుత ముంపునకు గురయ్యే గ్రామాలు 44 ఉన్నాయి. బాధిత కుటుంబాలు 5,168 ఉండగా 3,055 కుటుంబాలకు మాత్రమే ప్యాకేజీ వచ్చింది. మరో 2,563 కుటుంబాలకు అందాల్సి ఉంది. ఇప్పటికి 17 గ్రామాలను మాత్రమే ఖాళీ చేశారు. 27 గ్రామాలవారు అక్కడే ఉంటున్నారు. విఆర్‌పురం మండలంలో 20, కూనవరం మండలంలోని ఒక గ్రామంతో మొత్తం 21 గ్రామాలు ముంపునకు గురికానున్నాయి. విఆర్‌పురంలోని 2,184 కుటుంబాలకు, కూనవరం మండలంలో 166 కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉంది. అక్కడి ప్రజలు కొండలపై, గుట్టలపై తాత్కాలిక పునరావాసం ఏర్పాటు చేసుకుంటున్నారు.

Related Posts