YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

ఇంటర్ ఆన్ లైన్ క్లాసులు.. ఫీజులు దందా

ఇంటర్ ఆన్ లైన్ క్లాసులు.. ఫీజులు దందా

హైద్రాబాద్, జూలై 23, 
ఫీజు కడితేనే ఆన్‌లైన్‌ క్లాసులు.. లేదంటే అంతే.. మేము చెప్పింది అందరూ వినాల్సిందే.. కరోనా ఉంటే మాకేంటి? మాకు ఫీజు కట్టాల్సిందే. లేకుంటే ఆన్‌లైన్‌ క్లాసుల నుంచి తొలగిస్తాం. మీరే నష్టపోతారు. ఫీజుతో పాటు పుస్తకాలు కొనాల్సిందే.. ఇది కార్పొరేట్‌ కాలేజీల హుకుం.. చేసేదేమి లేక చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు అప్పుచేసి మరీ ఫీజులు చెల్లిస్తున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా క్లాసులు నిర్వహించడమే కాకుండా ఫీజులు కూడా వసూలు చెల్లిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించకూడదు. కానీ ఎక్కడా ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదు.హైదరాబాద్‌ చుట్టూ కార్పొరేట్‌ కాలేజిలున్నాయి. శివార్లలో విద్యావ్యాపారం మూడు పూవ్వులు ఆరుకాయలుగా కొనసాగుతోంది. దీంతో రోజుకో ప్రాంతంలో కాలేజీలకు సంబంధించిన బ్రాంచీలు ప్రారంభమవుతున్నాయి. అనుమతులున్నాయా లేవా అనేది విద్యార్థుల తల్లిదండ్రులు సరిగా పట్టించుకోవడం లేదు. ప్రముఖ కాలేజిల్లో చదివిస్తే మంచి మార్కులస్తాయనే నమ్మకంతో చాలామంది కార్పొరేట్‌ కాలేజిల్లో తమ పిల్లలను చేర్పిస్తున్నారు. ఇది కాలేజీలకు ఆర్థికంగా కలిసివస్తోంది. నిబంధనలకు వ్యతిరేకంగా కాలేజీలు నడుస్తున్నా అటు వైపు కన్నెత్తి చూసే నాథుడే కనిపించడం లేదు. కాలేజీల వైపు ఎవరూ రాకపోవడంతో కార్పొరేట్‌ కాలేజీల వ్యాపారం జోరుగా సాగుతోంది. ఏం జరిగినా తాము మేనేజ్‌ చేస్తామనే ధీమా వారిలో వందకు వందశాతం ఉండటంతో వారి వ్యాపారం రోజురోజుకు విస్తరిస్తోంది. హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి జిల్లా పరిధిలో సుమారు వంద వరకు కార్పొరేట్‌ కాలేజిలున్నాయి. వీటిలో అనుమతులు లేనివి కూడా ఎక్కువే. నిబంధనలకు వ్యతిరేకంగా ఫైర్‌ సేఫ్టీ లేకపోవడంతో 68 కాలేజిల అనుమతులు కూడా రద్దు చేశారు. అయినా బ్రాంచీలు మార్పుచేస్తూ అడ్మిషన్లు తీసుకుంటూనే ఉన్నారు. 2020-22 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎలాంటి గైడ్‌లెన్స్‌ రాలేదు. ఐతే మాకేంటి అనే విధంగా కార్పొరేట్‌ కాలేజీలు వ్యవహరిస్తున్నాయి. బోర్డు షెడ్యూల్‌ ప్రకటించిన తర్వాతే కాలేజీల్లో అనుమతులు, ఫీజులు వసూలు చేయాల్సి ఉంటుంది. కానీ ఈసారి అంతా వారి ఇష్టంగానే కొనసాగుతోంది. కరోనా నేపథ్యంలో మార్చి చివరివారం ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. ఇంటర్‌ పరీక్షలు ఎట్టకేలకు పూర్తి చేశారు. ఫలితాలు కాస్త ఆలస్యంగా విడుదల చేశారు. పదో తరగతి పరీక్షలు విద్యార్థులను ప్రభుత్వం పాస్‌ చేసింది. పదో తరగతి పరీక్షలు పూర్తి కాకుండానే కొన్ని కళాశాలలు అడ్మిషన్ల దందాకు తెరదీశారు. పదో తరగతి పరీక్షలకంటే ముందు విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా ఇంటర్‌ క్లాసులకు హాజరయ్యారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ముందుగా అడ్మిషన్లు తీసుకుంటే ఫీజుల్లో రాయితీలు ఇస్తామని పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో చాలామంది అడ్మిషన్లు తీసుకున్నారు. బోర్డు నుంచి నేటికీ ఎలాంటి గైడ్‌లైన్స్‌ లేవు. ఐనా ఎప్పటినుంచో అడ్మిషన్లు తీసుకుంటున్నారు.కరోనా రోజురోజుకి ఉధృతమవుతోంది. ఇంట్లో నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. కానీ కొన్ని బ్రాంచీలు మాత్రం ఫీజులు చెల్లించాల్సిందేనని హుకుం జారీ చేస్తున్నారు. ఫీజు కడితేనే ఆన్‌లైన్‌ క్లాసులకు అనుమతిస్తున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధం కావాల్సిన రెండో సంవత్సరం విద్యార్థులు తల్లిదండ్రులపై ఒత్తిడితెచ్చి ఫీజులు కట్టిస్తున్నారు. పుస్తకాలు కూడా వారి కాలేజీలో కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కరోనా నేపథ్యంలో ఫీజులు పెంచకూడదని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయినా పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా కార్పొరేట్‌ కాలేజీల్లో ఈ దందా జోరుగా సాగుతోంది. నెల రోజుల నుంచి ఫీజుల వసూలుపై దృష్టిని కేంద్రీకరించారు. మెసేజ్‌లు పెట్టడం, నేరుగా ఫోన్ల ద్వారా మాట్లాడటం విద్యార్థుల తల్లిదండ్రులపై తీవ్ర ఒత్తిడి పెంచుతున్నారు.2020 - 21 విద్యా సంవత్సరం ఎప్పుడు ప్రారంభమవుతుందోననే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పోటీ పరీక్షలకు వెనకబడి పోతామనే ఆందోళన విద్యార్థుల్లో నెలకొంది. కరోనా రోజురోజుకు ఉధృతమవుతోంది. పాజిటివ్‌ కేసులు వాయువేగంతో పెరిగిపోతుండటంతో అడుగు ముందుకు వేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి తరుణంలో విద్యాసంవత్సరం ఎప్పుడు ప్రారంభమవుతుందోననే ప్రచారం జోరుగా సాగుతోంది. కాలేజీలు రికార్డు స్థాయిలో ఉన్న ప్రాంతాల పరిధిలోనే కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో ప్రభుత్వం కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతోంది. కరోనా కట్టడి అయ్యాకే విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందనే ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. నీట్‌, ఎంసెట్‌ల కోసం విద్యార్థులు సమాయత్తం కావల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ తరగతులు అప్పుడే ప్రారంభమయ్యాయి. విద్యాసంవత్సరం షెడ్యూల్‌ విడుదల చేస్తే దానికి అనుగుణంగా విద్యార్థులు సమాయత్తం అయ్యేందుకు వీలుంటుంది.

Related Posts