YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

అనుబంధ కళాశాలలకు నో ఎన్ఓసీ

అనుబంధ కళాశాలలకు నో ఎన్ఓసీ

హైద్రాబాద్, జూలై 23, 
రాష్ట్రంలోని 1,456 ప్రైవేటు జూనియర్‌ కాలేజీలకు ఈసారి అనుబంధ గుర్తింపు లభించే పరిస్థితి లేకుండాపోయింది. అగ్నిమాపక శాఖ తమ నిబంధనలను మార్పు చేయడంతో వాటిన్నింటికి ఆ శాఖ నుంచి నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ (ఎన్‌వోసీ) ఇచ్చే పరిస్థితి లేదు. ఫైర్‌ ఎన్‌వోసీ లేకుండా ఇంటర్మీడియట్‌ బోర్డు కాలేజీలను నడిపేందుకు అనుబంధ గుర్తింపును జారీ చేసే పరిస్థితి లేదు. దీంతో ఆయా కాలేజీల పరిస్థితి గందరగోళంలో పడింది. దీనిపై ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టేందుకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం సాయంత్రం అగ్నిమాపక శాఖ డైరెక్టర్‌ జనరల్, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామ్‌చంద్రన్, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌తో ఉన్నత స్థాయి కోఆర్డినేషన్‌ సమావేశం నిర్వహించారు. అందులో ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారు. దీంతో సమావేశం అర్ధంతరంగానే ముగిసింది. అయితే రాష్ట్రంలో 1,586 కార్పొరేట్, ప్రైవేటు జూనియర్‌ కాలేజీలుంటే అందులో కేవలం 130 కాలేజీలు మాత్రమే అగ్నిమాపక శాఖ తాజా నిబంధనల ప్రకారం ఉండటంతో వాటికి మాత్రమే ఇంటర్‌ బోర్డు అనుబంధ గుర్తింపునిచ్చే అవకాశముంది. మిగతా 1,456 కాలేజీలకు అనుబంధ గుర్తింపు లభించే అవకాశం లేకుండా పోయింది. రాష్ట్రంలో 15 మీటర్ల కంటే తక్కువ ఎత్తున్న విద్యా సంస్థల భవనాలకు ఫైర్‌ ఎన్‌వోసీ అవసరం లేదని, అంతకంటే ఎక్కువ ఎత్తున్న భవనాలకే ఫైర్‌ ఎన్‌వోసీ అవసరమని అగ్నిమాపక శాఖ 2017లో ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ గతేడాది హైకోర్టులో పిల్‌ దాఖలైంది. ఈ కేసులో వాదనల సందర్భంగా అంతకుముందు ఉన్న ఉత్తర్వులను సవరిస్తున్నామని, 6 మీటర్లలోపు ఎత్తు మాత్రమే ఉన్న భవనాలకు ఎన్‌వోసీ ఇస్తామని, అంతకంటే ఎత్తున్న భవనాలకు ఎన్‌వోసీ ఇవ్వబోమని ఉత్తర్వులను సవరించింది. ఈ మేరకు 2020 ఫిబ్రవరి 22న సవరణ ఉత్తర్వులను జారీ చేసింది. అదే విషయాన్ని హైకోర్టుకు తెలియజేసింది. అయితే 2020–21 విద్యా సంవత్సరంలో కాలేజీలు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలో ఫైర్‌ ఎన్‌వోసీ లేకుండాపోయింది.1,456 కాలేజీలు 6 మీటర్లకంటే ఎక్కువ ఎత్తున్నవే. వాటికి అగ్నిమాపక శాఖ ఫైర్‌ ఎన్‌వోసీ జారీ చేయలేదు. దీంతో యాజమాన్యాలు బోర్డు అధికారులకు, విద్యాశాఖ మంత్రికి పలుమార్లు విన్నవించారు. దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు చేరే ఆ కాలేజీలకు ఫైర్‌ ఎన్‌వోసీ లేకుండా, అనుబంధ గుర్తింపు ఇవ్వకుండా కొనసాగించడం ఎలా అన్న దానిపై చర్చించారు. అయితే తాము ఏమీ చేయలేమని, నిబంధనలను మార్పు చేసి హైకోర్టుకు విషయాన్ని చెప్పినందున ఆ నిబంధనలను ఇప్పుడు సవరించడం కుదరదని, నిబంధనల మేరకు ఉన్నవాటికే ఎన్‌వోసీ జారీ చేస్తామని అగ్నిమాపక శాఖ పేర్కొంది.కావాలనుకుంటే తమ ఉత్తర్వులను కోర్టులో సవాల్‌ చేయడం, లేదా కాలేజీలను ఫైర్‌ ఎన్‌వోసీ నుంచి మినహాయిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చుకొని ముందుకు సాగవచ్చని సూచించింది.  

Related Posts