YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

పోటీలో ఫీల్డ్ అసిస్టెంట్స్

పోటీలో ఫీల్డ్ అసిస్టెంట్స్

కరీంనగర్, జూలై 23, 
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్‌లు కీలక నిర్ణయం తీసుకున్నారు. తమను తిరిగి ఉద్యోగాల్లో తీసుకుంటూ రీ అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఇవ్వకపోతే ప్రత్యక్ష ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కలు చూపించాలని భావిస్తున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఏకంగా వెయ్యి మందిని బరిలోకి దింపాలని చూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పని చేస్తున్న 7,600 మంది ఫీల్డ్ అసిస్టెంట్‌లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని.. లేనట్టయితే బై పోల్‌ బరిలో నిలిచి టీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తామని హెచ్చరిస్తున్నారు. వీరికి బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కూడా మద్దతు తెలిపి దీక్షను చేపట్టడంతో ఫీల్డ్ అసిస్టెంట్ల ఆందోళన తీవ్రరూపం దాల్చుతోంది. ఇప్పటికే హుజూర్‌నగర్, నాగార్జున సాగర్ ఉప ఎన్నికలకు ముందు న్యాయం చేస్తామని చెప్పిన సర్కార్ ఎన్నికల తరువాత తమను విస్మరించిందని ఫీల్డ్ అసిస్టెంట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 10 వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, వారి కుటుంబాలు కూడా క్షేత్ర స్థాయిలో ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నాయి.ఫీల్డ్ అసిస్టెంట్లు వెయ్యి మంది హుజురాబాద్ బరిలో నిలిస్తే రికార్డు బ్రేక్ కానుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో రైతులు ఎన్నికల్లో పోటీ చేశారు. ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటు నిజామాబాద్ ప్రాంతానికి చెందిన 175 మంది రైతులు అప్పటి ఎన్నికల్లో పోటీ చేసి అభ్యర్థుల గెలుపు ఓటములను శాసించారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఏకంగా వెయ్యి మంది పోటీ చేస్తే దేశంలోనే అరుదైన రికార్డు నమోదు కానుంది. ఒకే చోట ఒకే ఎన్నికల్లో వెయ్యి మందికి పైగా పోటీ చేయడం అన్న రికార్డు హుజురాబాద్ బై పోల్స్‌కు దక్కనుంది.

Related Posts