YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మోదీ లేకుంటే ఎప్పుడో రాజీనామా చేసుండేవాడిని: దేవెగౌడ

మోదీ లేకుంటే ఎప్పుడో రాజీనామా చేసుండేవాడిని: దేవెగౌడ

నిన్న తన బహిరంగ సభ ప్రసంగంలో మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడపై ప్రధాని నరేంద్ర మోదీ పొగడ్తల వర్షం కురిపించిన నేపథ్యంలో, నేడు దేవెగౌడ సైతం అదే పని చేశారు. నరేంద్ర మోదీ పార్లమెంట్ లో లేకుంటే తాను ఎప్పుడో ఎంపీ పదవికి రాజీనామా చేసుండేవాడినని ఆయన వ్యాఖ్యానించారు. మోదీ వంటి వ్యక్తిని దగ్గరగా చూడటం, మాట్లాడటం కోసమే తాను పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగుతున్నానని అన్నారు.గతంలో సొంతంగా బీజేపీకి మెజారిటీ వస్తే రాజీనామా చేస్తానని చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసిన ఆయన, తాను ఆ పనికి సిద్ధపడ్డానని, అయితే మోదీలోని నైపుణ్యం, స్పృహ తనను ఆపాయని చెప్పారు. నరేంద్ర మోదీని 'స్మార్ట్ పొలిటీషియన్'గా అభివర్ణించిన ఆయన, కర్ణాటక రాజకీయాల్లో ఏం జరుగుతుందన్న విషయమై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి మోదీ అని అన్నారు.ఇక తనను గురించి రాహుల్ చేసిన వ్యాఖ్యలు నిజమైనవేనని, రాహుల్ తనను ఎన్నడూ అగౌరవంగా చూడలేదని చెప్పిన దేవెగౌడ, అంతమాత్రాన ఆయనతో తనకు విభేదాలు లేనట్టు కాదని చెప్పారు. రాహుల్ ను కలసి రాష్ట్ర సమస్యలు చెబితే, వాటన్నింటినీ విన్న రాహుల్, సమస్యల పరిష్కారానికి చొరవ చూపేలా రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఎటువంటి సూచనలూ అందించలేదని ఆరోపించారు.కాగా, మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో ఏ పార్టీకీ మెజారిటీ రాదని, కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించినా, దేవెగౌడ, కుమారస్వామి నేతృత్వంలోని జేడీ(ఎస్) కింగ్ మేకర్ అవుతుందని పలు సర్వేలు స్పష్టం చేస్తున్న వేళ, ఆ పరిస్థితే వస్తే కాంగ్రెస్ ను అధికారం నుంచి దూరం చేసేందుకు ఆ పార్టీతో చేతులు కలిపేందుకు మోదీ సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే దేవెగౌడకు దగ్గరయ్యేందుకు నరేంద్ర మోదీ పావులు కదుపుతున్నారని, అందులో భాగంగానే ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.ఇక దేవెగౌడ కుమారుడు, అవకాశం వస్తే సీఎం సీటును అధిష్టించాలని భావిస్తున్న కుమారస్వామి, పైకి తమకు మెజారిటీ వస్తుందని చెబుతున్నా, కాంగ్రెస్ కు అధికారం రారాదని, తాను కింగ్ మేకర్ గా మారాలని కోరుకుంటున్న పరిస్థితి నెలకొంది.

Related Posts