ఓవైపు ఇండియాలో ఆధార్ ప్రైవసీపై చర్చ జరుగుతుండగా.. మరోవైపు ఈ గుర్తింపు కార్డు అద్భుతమని కొనియాడారు ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్. ఇతర దేశాల్లోనూ ఇలాంటి గుర్తింపు కార్డు ప్రవేశపెట్టేందుకు వరల్డ్ బ్యాంక్‌కు తమ బిల్, మెలిండా గేట్స్ ఫౌండేషన్ నుంచి విరాళాలు కూడా ఇచ్చారు. ఇండియాలో ఆధార్ తీసుకొచ్చిన నందన్ నీలేకని ఈ ప్రాజెక్ట్ విషయంలో వరల్డ్ బ్యాంక్‌కు సాయం చేస్తున్నట్లు గేట్స్ వెల్లడించారు. ఆధార్‌తో చాలా లాభాలు ఉన్నాయని కూడా గేట్స్ అంటున్నారు. ఇతర దేశాలూ ఈ ఆధార్‌లాంటి కార్డులను జారీ చేయాలి. ఏ ప్రభుత్వమైనా తమ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయాలన్నా, ప్రజలను శక్తివంతులను చేయాలన్నా నాణ్యమైన పాలన చాలా అవసరం. దానికి ఇలాంటి వ్యవస్థ ఉపయోగపడుతుంది. ఆధార్‌ను ఇతర దేశాల్లో తీసుకొచ్చేందుకు వరల్డ్‌బ్యాంక్‌కు విరాళమిచ్చాం అని బిల్ గేట్స్ చెప్పారు. ఇప్పటికే పొరుగు దేశాలతోపాటు మరికొన్ని కూడా ఈ విషయంలో సాయం చేయాల్సిందిగా ఇండియాను కోరాయి. మరి దీని ప్రైవసీపై ఆందోళన వ్యక్తమవుతుంది కదా అని ప్రశ్నిస్తే.. ఆధార్‌తో ప్రైవసీకి ఎలాంటి భంగం వాటిల్లదు. ఎందుకంటే ఇది కేవలం ఓ బయో ఐడీ వెరిఫికేషన్ స్కీమ్ మాత్రమే అని గేట్స్ అన్నారు. గతంలో నీతి ఆయోగ్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కూడా ఆధార్‌పై గేట్స్ ప్రశంసలు కురిపించారు. ప్రపంచంలో ధనిక దేశాలు కూడా ఇలాంటి వ్యవస్థను తీసుకురాలేదని గేట్స్ అప్పట్లో అన్నారు.