YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

అయోధ్య చుట్టూ యూపీ రాజకీయాలు

అయోధ్య చుట్టూ యూపీ రాజకీయాలు

లక్నో, జూలై 24, 
ఉత్తర భారత దేశంలోనే కాదు... దేశ వ్యాప్తంగా ఎక్కువ లోక్‌సభ స్థానాలు కలిగి ఉన్న ఏకైక రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌. సార్వత్రిక ఎన్నికల్లో ఈ రాష్ట్రం నుండి మెజార్టీ స్థానాలు గెలుపొందిన పార్టీనే అధికారంలోకి వస్తుందనడంలో అతిశయోక్తి లేదని రాజకీయ విశ్లేషకుల భావన. ఈ రాష్ట్రానికి వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. అత్యధిక అసెంబ్లీ స్థానాలు కలిగిన రాష్ట్రం కూడా ఇదే కావడం విశేషం. అందుకే... అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాదే అయినా... ఇప్పటి నుండే సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అందరీ చూపు యుపిపై ఉంటే... రాష్ట్రంలోని రాజకీయ పార్టీల చూపు అయోధ్య నగరంపై ఉంది. ఏ పార్టీకాపార్టీ నగరంలో తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. దీని నిమిత్తం కేంద్రం, యుపి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అంతం లేదని తెలుస్తోంది.బహుజన్‌ సమాజ్‌ పార్టీ 2007లో వినియోగించిన సోషల్‌ ఇంజనీరింగ్‌ విధానాన్ని మరోసారి అవలంభించేందుకు సిద్ధమైంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బ్రాహ్మణుల ఓట్లను కూడగట్టేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ నేపథ్యంలో జులై 23 తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ సామాజిక వర్గానికి చెందిన ప్రజలతో అదే వర్గానికి చెందిన బిఎస్‌పి నేత సతీష్‌ చంద్ర మిశ్రా పలు సమావేశాలు నిర్వహించనున్నారు. తొలి సమావేశం అయోధ్యలో జరగనుంది. ఇంకో అంశమేమిటంటే... ఎప్పుడూ అయోధ్య సమస్యపై స్పందించడంలో ఈ పార్టీ చాలా దూరంగానే ఉందని చెప్పవచ్చు. యుపి ఎన్నికల్లో హిందూత్వ ఓటర్లను మూటగట్టేది నిస్సందేహంగా అయోధ్యలోని రామాలయం అంశమేనని లక్నో యూనివర్శిటీ పొలిటికల్‌సైన్స్‌ విభాగం మాజీ హెడ్‌ ఎస్‌కె ద్వివేది వ్యాఖ్యానించారు. ఇక్కడ రాముని పేరుతో హిందూ ఓటర్లను ప్రభావితం చేయవచ్చునని అభిప్రాయపడ్డారు. సమస్య పాతదే కానీ, అయోధ్యలో ఇప్పుడు చేపడుతన్న ఆలయ నిర్మాణం సరికొత్త అంశంగా మారిందని అన్నారు.యుపిలో రామాలయ నిర్మాణం... హిందూ ఓటర్లపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయని రాజకీయ స్పృహ ఉన్నవాడు ఇట్టే చెప్పేస్తాడు. ఇక్కడ మెజార్టీ కమ్యూనిటీలో ఎక్కువ ఓట్లు పొందిన పార్టీనే.... అధికారంలోకి వస్తానడంలో అతిశయోక్తి లేదు. ఇది తెలుసు కాబట్టే.. బిఎస్‌పి అయోధ్యలోని హిందూ ఓటర్లను ఒడిసి పట్టేందుకు అక్కడకు వెళుతోంది' అని ద్వివేది అన్నారు. బిజెపికి దేవాలయం క్రెడిట్‌ ఇవ్వకూడదని బిఎస్‌పి, ఎస్‌పిలు భావిస్తున్నాయని చెప్పారు. మరో వైపు ఎస్‌పి, ఆమ్‌ ఆద్మీ పార్టీలు సైతం అయోధ్యకు సంబంధించిన అంశాలపై చురుగ్గా ఉన్నాయి. ఈ రెండు పార్టీలకు చెందిన నేతలు సైతం ఇటీవల జరిగిన అయోధ్య భూముల విషయంపై దృష్టి పెట్టారు. ఆలయ నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్న శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర అవకతవకలకు పాల్పడ్డాయంటూ తూర్పార బట్టారు.అయోధ్యలోని రామాలయ సమస్యను 1980 నుండి నిశితంగా పరిశీలిస్తున్నారు ప్రముఖ జర్నలిస్ట్‌ బ్రిజేష్‌ శుక్లా గత జ్ఞాపకలను గుర్తు చేసుకున్నారు. కాలం ఎంతో మార్పు చెందిందని వ్యాఖ్యానించారు. . '1980లో, పార్లమెంట్‌ ఎన్నికల నిమిత్తం తన ఎన్నికల ప్రచార ర్యాలీని అప్పటి కాంగ్రెస్‌ నేత రాజీవ్‌ గాంధీ ఇక్కడి నుండే ప్రారంభించారు. కానీ కాంగ్రెస్‌ ఎందుకో ఈ సమస్యపై వెనక్కు తగ్గింది. గతంలో ఇదొక పురాణం. కానీ ఇప్పుడు రియాల్టీగా మారింది' అని అన్నారు. బిజెపి మినహా అన్ని పార్టీలు ముస్లిం మైనార్టీ వర్గాలను వ్యతిరేకించడం ఇష్టం లేనందున... ఈ సమస్యపై దృష్టి సారించలేదని అభిప్రాయపడ్డారు. గతంలో పార్టీలన్నీ ఎన్నికల్లో గెలవాలంటే... ముస్లిం ఓట్లు కూడా అవసరమని భావించేవని, కానీ అవన్నీ అవాస్తవాలని బిజెపి నిరూపించిందని, అందుకే ప్రతి పార్టీ కూడా హిందూ ఓటర్లపైనే దృష్టి సారించాయని శుక్లా అన్నారు. గతంలో అయోధ్య రామాలయంపై అనిశ్చితి ఉండేదని, కానీ ఇప్పటి పరిస్థితిని చూస్తే.... రాజకీయ పార్టీలు హిందూ ఓటర్లను ఎందుకు దూరం చేసుకుంటాయని ప్రశ్నించారు. 'ఎస్‌పి, బిఎస్‌పి, ఆప్‌ ఏ రాజకీయ పార్టీ అయినా కానీ... అయోధ్య కోసం ఎంతో కొంత చేయాలని చూడటం వాస్తవం కాదా? తాము కూడా అయోధ్య ఆలయానికి మద్దతు తెలుపుతున్నామని ప్రజలకు చెప్పేందుకు సిద్దమౌతున్నాయి. కేవలం హిందూ ఓట్లు బిజెపి సొత్తు కావడానికి ఏ మాత్రం ఇతర పార్టీలు ఇష్టపడటం లేద'ని చెప్పారు.ఇటు బిజెపి నేతృత్వంలోని యోగి సర్కార్‌ తిరిగి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే అయోధ్య ఆలయ నిర్మాణ పనులు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో 15 పథకాలను ప్రారంభించింది. అయోధ్య నిర్మాణానికి సమయం పట్టనున్న నేపథ్యంలో... ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు పథకాలను తీసుకువస్తోంది. ఇవన్నీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పూర్తి కావాలని యోగి సర్కార్‌ యోచిస్తోంది. అయోధ్యలో ఆగస్టు చివర్లో రామ్‌లీలా ప్రోగ్రామ్‌ను నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ప్రణాళిక చేసింది. ఇందులో వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారులు ప్రదర్శనలిస్తారు. దీనిలో కేంద్రం కూడా తన వంతు ప్రోత్సాహం, కృషిని అందిస్తోంది. అయోధ్యకు వెళ్లే పురాతన తీర్థయాత్ర మార్గాన్ని రూ.3 వేల కోట్ల వ్యయంతో జాతీయ రహదారిగా చేస్తామని, కేంద్ర రోడ్లు రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ బుధవారం ట్వీట్‌ చేశారు. అయోధ్యలోని రామాలయం ఉద్వేగపూరిత అంశమని, ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలనుకొంటారని కాన్పూర్‌కు చెందిన రాజకీయ విశ్లేషకుడు మనోజ్‌ త్రిపాఠి చెప్పారు. అయోధ్యలో రామాలయం నిర్మాణం జరుగుతున్నప్పటికీ... వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఆశిస్తున్న డివిడెంట్లు రాకపోవచ్చునని త్రిపాఠి అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకు ఉదాహరణ ఇటీవల కాలంలో జరిగిన పంచాయతీ ఎన్నికలోల హిందూ మత ప్రాంతాలైన అయోధ్యతో పాటు వారణాసి, మధురల్లో బిజెపి ఘోర పరాజయాన్ని చవిచూసిందని చెప్పారు.

Related Posts