పార్టీతో పొత్తు పెట్టుకునేది లేదని పరోక్షంగా ప్రకటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. త్వరలోనే రాష్ట్రవ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. ఏపీలో 175 స్థానాలలో తమ పార్టీ పోటీ చేస్తుందని చెప్పడం ద్వారా.. తమకు ఎవరితోనూ ఎన్నికల పొత్తులు ఉండబోవని ఆయన పరోక్షంగా వెల్లడించినట్లయింది. తమ పార్టీ కార్యకర్తలందరికీ రెండేసి ఎన్నికల అనుభవం ఉందని చెప్పిన పవన్.. ఎన్నికల శంఖారావం పూరించేశారు. ఈనెల మూడోవారం నుంచే ఆయన తన పర్యటనకు రూట్‌మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిసింది. రాయలసీమలోని కడప, కర్నూలు జిల్లాల నుంచి పర్యటన మొదలుపెట్టి.. అక్కడినుంచి గుంటూరు జిల్లాలోని పల్నాడులోకి ప్రవేశించాలని భావిస్తున్నట్లు సమాచారం. పల్నాడులో పర్యటన ముగిశాక కృష్ణా జిల్లా మీదుగా ఉభయ గోదావరులు చుట్టబెట్టి, అటు నుంచి ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లోని వెనుకబడిన ప్రాంతాలలో పర్యటిస్తూ శ్రీకాకుళంలో ముగించేలా రూట్ రూట్‌మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. తొలి విడత పర్యటన పూర్తయిన వెంటనే కొద్దిపాటి విరామం తర్వాత మలి విడత, ఆ తర్వాత మూడో విడత పర్యటన కూడా పూర్తి చేయటం ద్వారా రాష్ట్రంలోని అన్ని నియోజవర్గాల్లో పవన్ టూర్ ఉండేలా ప్రణాళిక రూపొందించారు. ఆగస్టు 15 లోపు రాష్ట్రం మొత్తం పర్యటన పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. పర్యటన మొత్తం బస్సులోనే ఉంటుందనీ, ఎక్కడికక్కడ బస్సు నుంచి దిగి ఓపెన్ టాప్ వాహనం పైనుంచి పవన్ మాట్లాడతారని తెలిసింది. ఈ బస్సు యాత్రలో ఎక్కడా బహిరంగ సభలు ఉండవని అంటున్నారు. బహిరంగసభలు నిర్వహిస్తే సమయం వృథా అవుతుందనే ఉద్దేశంతో ‘బస్సు యాత్ర’లోనే ప్రసంగించేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది. దీని కోసం బస్సులో అన్ని సౌకర్యాలు ఉండేలా చూసుకుంటున్నారు. బస్సు యాత్ర ద్వారా పవన్ మరింత దూకుడు పెంచనున్నట్టు తెలిసింది. ఎక్కడ ఏం మాట్లాడాలి.. బస్సుయాత్ర మార్గంలోని నియోజకవర్గాల్లో ఉన్న ప్రత్యేక సమస్యలు, అక్కడి ఎమ్మెల్యేల పనితీరు తదితర విషయాలపై క్షేత్రస్థాయి నుంచి నివేదికలు తెప్పించుకుంటున్నట్టు తెలిసింది. అన్నింటికీ మించి ప్రభుత్వ అవినీతిని ఎండగట్టేలా పదునైన ప్రసంగాలు చేసేందుకు అవసరమైన కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. అవినీతిపై కొన్ని సాక్ష్యాలు, ఆధారాలు కూడా వెల్లడించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఇప్పటికే దీనిపై కొన్ని బలమైన ఆధారాలను జనసేన సేకరించినట్టు సమాచారం. వీటన్నింటి దృష్ట్యా.. పవన్ పర్యటన రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న రాజకీయ వేడిని మరింత రగిల్చే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.