వరంగల్, జూలై 24,
తల్లిదండ్రులకు పిల్లలు అదనపు భారంలా మారడంతో వారినీ కూలి పనులకు తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని ఏజెన్సీలో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. పాఠశాలలున్న సమయంలో ఉచితంగా మధ్యాహ్న భోజనం, ప్రభుత్వ హాస్టల్స్‌ల్లో భోజనం అందించేవారు. దాంతో తల్లిదండ్రులు తిన్నాతినకపోయినా చదువుపేరుతో పిల్లల కడుపయినా నిండేది. వారానికి మూడు సార్లు గుడ్డుతో పాటు పప్పు, కూరలు, సాంబార్, సన్నబియ్యంతో భోజనం పెట్టేవారని విద్యార్థుల తల్లిదండ్రులు గుర్తుచేస్తున్నారు.బడున్నప్పుడు మధ్యాహ్న భోజనం ఉండేది..ఇప్పుడుఖమ్మం జిల్లా చింతకాని మండలం లచ్చగూడెం గ్రామంలో ఒకటి నుంచి 10 తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు 200 మంది ఉన్నారు. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాల నుంచి వచ్చిన వీరంతా లాక్‌డౌన్ మూడునెలల కాలంలో తల్లిదండ్రులకు పనులు లేక ఆర్థికంగా చితికిపోయారు. ఇప్పుడు కొద్దిగా పనులు దొరుకుతుండటంతో పిల్లలనూ తమవెంట పనులకు తీసుకెళ్తున్నామని ఓ తల్లి తెలిపింది. బడున్నప్పుడు మధ్యాహ్నం భోజనం పెట్టేవారు. ఇప్పుడు లేకపోవడంతో ఇంట్లో ఇబ్బంది అవుతుందని అన్నారు. మరికొంత మంది తల్లిదండ్రులతో కలిసి వ్యవసాయ పనులు చేస్తున్నారు. వీరిలో ఎక్కువగా మంది బాలికలు ఉండడం గమనార్హం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గిరిజన, కోయ సామాజిక వర్గానికి చెందిన పిల్లలెక్కువగా పనులకు వెళుతున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా తాడూరు మండలం గుంతకోడురు గ్రామంలోని 120మంది విద్యార్థులు, బిజినేపల్లి మండలం మంగనూరు గ్రామంలో 125మంది విద్యార్థులు.. వ్యవసాయ పనుల్లో తల్లిదండ్రులకు సహాయపడుతున్న వారు కొందరయితే, కూలి పనులకు వెళుతున్నవారు మరికొందరు. కూలీలను పెట్టుకునే ఆర్థిక స్థోమత లేని వారు విత్తనాలు, ఎరువులు చల్లడం వంటి పనులను తమ పిల్లలతో చేయిస్తున్నారు. అలాగే, టీ కొట్లు, బట్టల దుకాణాల్లో వ్యాపారాలకు పిల్లలను పంపుతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో పిల్లలను అటవీ ఫలాలు సేకరణకు తీసుకెళ్తున్నారు.వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం గుండెపల్లి గ్రామంలో విద్యార్థులు మొక్కలు నాటాడానికి వెళ్తున్నారు. దోమ, కుల్కచర్ల మండలాల్లో విద్యార్థులు కంది, మక్క చేలల్లో కనిపిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, మాడ్గుల మండల్లాలో పత్తి పంట పనులకు వెళ్తున్నారు. వారికి రోజుకు రూ. 200 కూలి వస్తుంది. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నత పాఠశాల, ఇంటర్, డిగ్రీ చదువుతున్న గ్రామీణ ప్రాంత విద్యార్థులు వానాకాలం పంటల సాగులో తల్లిదండ్రులకు సహకరిస్తుండగా, పట్టణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు తమ తల్లిదండ్రులు చేసే వ్యాపారాలు, ఇతరత్రా పనులతో పాటు తమ వ్యాపకాలపై దృష్టి సారిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మేస్త్రి పనులతో పాటు నారు, కలుపు లాంటి వ్యవసాయ పనులకూ వెళుతున్నారు. బోయినపల్లి మండలంలో రోడ్ల వెంట మొక్కజొన్న కంకులు అమ్ముతూ, గొర్ల కాపరిగానూ పనిచేస్తున్నారు.