శ్రీమఠంలో మృత్తిక సంగ్రహణ మహోత్సవం ఘనంగా గురుపూజోత్సవ కార్యక్రమం బృందావనానికి ప్రత్యేక పూజలు
కర్నూలు జిల్లా మంత్రాలయం పవిత్ర తుంగా తీరంలో వెలసిన పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీగురు రాఘవేంద్రుల సన్నిధిలో మఠం పీఠాధిపతులు అధ్వర్యంలో గురు పౌర్ణమి సందర్భంగా మృతిక సంగ్రహణ మహోత్సవం గురు పూజోత్సవంను పండితులు ఘనంగా నిర్వహించారు.ముందుగా గ్రామ దేవత మంచాలమ్మ కి ప్రత్యేక పూజలు చేసి మంగళ హారతి ఇచ్చారు.అనంతరం శ్రీశ్రీశ్రీ సుబుధీంధ్ర తీర్థులు తుంగభద్రా నది తీరాన ఉన్న తులసి వనము దగ్గరకు బంగారు పల్లకిలో ఊరేగింపుగా వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించి తులసి వనం అంతర్భాగంలో అత్యంత పవిత్రమైన మృత్తికను స్వీకరించి ఊరేగింపుగా వచ్చి రాఘవేంద్ర స్వామి మూల బృందావనం పైన ఉంచి ప్రత్యేక పూజలు చేసి మంగళ హారతులు నిర్వహించారు. అంతకుముందు రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి నిర్మల్య అభిషేకం పంచామృత అభిషేకము స్వర్ణ కవచ సమర్పణ విశేష పుష్పాలంకరణ గావించారు. గురుపూజోత్సవమును పురస్కరించుకొని శ్రీ మఠంలో భక్తుల సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు పవిత్ర తుంగా నదిలో స్నానం చేసి గ్రామదేవత మంచాలమ్మ రాఘవేంద్ర స్వామి మూల బృందావనంను దర్శించుకుని పునీతులయ్యారు.పీఠాధిపతులు భక్తులకు ఫల మంత్ర అక్షితలు ఇచ్చి ఆశీర్వదించారు.