ఒకవైపు రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు. వస్తాను అని ప్రకటించిన రజనీ మరికొంత సమయం తీసుకునేలా ఉన్నాడు. ఇంతలో వరస పెట్టి సినిమాలతో రాబోతున్నాడు సూపర్ స్టార్. ఇప్పటికే రజనీకాంత్ హీరోగా నటించిన ‘కాలా’ సినిమా విడుదలకు సన్నద్ధం అవుతోంది. అలాగే శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘2.0’ కూడా త్వరలోనే విడుదల కానుంది. ఈ రెండు సినిమాల సంగతలా ఉంటే, కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి రజనీకాంత్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.త్వరలోనే ఆ సినిమా షూటింగ్ మొదలుకానుంది. ఇందులో ఇతర నటీనటుల ఎంపిక సాగుతోంది. విజయ్ సేతుపతి ఈ సినిమాలో విలన్‌గా నటించనున్నాడని వార్తలు వస్తున్నాయి.ఆ సంగతలా ఉంటే ఈ సినిమాకు రజనీకాంత్ అత్యంత భారీ పారితోషకం పొందుతున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు రజనీ ఏకంగా 65 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకోనున్నాడని కోలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. రజనీకాంత్ సినిమాలకు ఉన్న మార్కెట్‌ను బట్టే ఆయన పారితోషకం తీసుకుంటున్నాడని ట్రేడ్ నిపుణులు అటున్నారు. ఇటీవలే ‘కాలా’ సినిమా టెలివిజన్ రైట్స్ దాదాపు 75 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని అంటున్నారు. ఇలా చూసుకుంటే, టెలివిజన్ రైట్స్ స్థాయి మొత్తాన్ని రజనీకాంత్ పారితోషకంగా తీసుకుంటున్నట్టుగా లెక్క!