ప్రణీత్ ఔట్
టోక్యో, జూలై 24,
టోక్యో ఒలింపిక్స్‌లో భారత స్టార్ షట్లర్ సాయి ప్రణీత్‌కి ఆరంభంలోనే ఊహించని షాక్ తగిలింది. శనివారం గ్రూప్-డి ఫురుషుల సింగిల్స్‌లో పోటీపడిన సాయి ప్రణీత్.. తన కంటే తక్కువ ర్యాంక్‌లో ఉన్న ఇజ్రాయిల్ షట్లర్ మిశా జిబర్‌మాన్ చేతిలో ఓడిపోయాడు. ఒలింపిక్స్‌లో సాయి ప్రణీత్ పోటీపడటం ఇదే తొలిసారికాగా.. 41 నిమిషాల్లోనే మ్యాచ్ ముగిసిపోయింది. తర్వాత మ్యాచ్‌ని నెదర్లాండ్స్‌కి చెందిన మార్క్‌తో సాయి ప్రణీత్ ఆడనున్నాడు. మార్క్ ప్రస్తుతం 29వ ర్యాంక్‌లో ఉన్నాడు.2019 వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం గెలుపొందిన సాయి ప్రణీత్.. ప్రస్తుతం 15వ ర్యాంక్‌లో ఉన్నాడు. అయినప్పటికీ.. 47వ ర్యాంక్‌లో ఉన్న జిబర్‌మాన్‌కి పోటీనివ్వలేకపోయాడు. మొదటి సెట్‌ని 17-21తో చేజార్చుకున్న సాయి ప్రణీత్.. రెండో సెట్‌ని కూడా 15-21తో కోల్పోయాడు.వాస్తవానికి ఫస్ట్ సెట్‌లో సాయి ప్రణీత్ ఒకానొక దశలో 8-4తో ఆధిక్యంలో నిలిచాడు. కానీ.. వరుసగా ఐదు పాయింట్లు సాధించిన జిబర్‌మాన్.. సాయి ప్రణీత్‌ని ఒత్తిడిలోకి నెట్టేశాడు. సాయి ప్రణీత్‌పై చివరి వరకూ ఆ ఒత్తిడిని కొనసాగించిన జిబర్‌మ్యాన్.. క్రాస్ కోర్ట్ స్మాష్‌లతో ఆకట్టుకున్నాడు.
హాకీ శుభారంభం
ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత్ హాకీ పురుషుల జట్టు శుభారంభం చేసింది. న్యూజిలాండ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సింగ్ సేన 3-2 తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. తొలి క్వార్టర్ చివరి వరకు 1-0తో ఆధిక్యంలో ఉన్న న్యూజిలాండ్ డిఫెన్స్‌ను బ్రేక్ చేసి భారత ఆటగాళ్లు తొలి క్వార్టర్ చివరన గోల్ ని సాధించి స్కోర్‌ను 1-1తో సమం చేసారు. ఇక రెండవ క్వార్టర్ లో పెనాల్టీ కార్నర్ ద్వారా హర్మన్ ప్రీత్ కొట్టిన గోల్ తో భారత్ 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇక మూడవ క్వార్టర్ లో భారత్ మరొక గోల్ తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.3-1 తో స్కోర్ ఉంచి ప్రత్యర్థికి మ్యాచ్ ను దూరం చేసేందుకు ప్రయత్నించినప్పటికీ... భారత డిఫెన్సె ను ఛేదిస్తూ న్యూజిలాండ్ గోల్ ని సాధించి స్కోర్ ని 3- 2కి చేర్చింది. ఇక ఆఖర్లో కాస్త భారత్,న్యూజిలాండ్‌లు వరుస రెఫరల్ లు తీసుకోవడంతో పెనాల్టీ కార్నర్లు దక్కడం సర్వత్రా ఆసక్తిని నెలకొల్పింది. భారత జట్టు తన రెఫరల్ ను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చింది. ఆఖరున మ్యాచ్ ముగుస్తుందనగా న్యూజిలాండ్ ఆఖరి 24 సెకండ్లు మిగిలి ఉండగా పెనాల్టీ కార్నర్ పొందింది. ఏమీ జరగబోతుందని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా... ఈ సమయంలో భారత కీపర్ శ్రీజేష్ తానెంత కీలక ఆటగాడినో మరోసారి నిరూపిస్తూ... ఫుల్ స్ట్రెచ్ తో న్యూజిలాండ్ ఆశలకు గండి కొడుతూ... భారత్ ను తదుపరి పోటీలో నిలిపాడు. కాగా భారత జట్టు తమ రెండో మ్యాచ్‌లో జూలై 25న పటిష్టమైన ఆస్ట్రేలియాను ఎదుర్కోనుంది.