YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం దేశీయం

ఋణానుబంధం.

ఋణానుబంధం.

ఋణానుబంధం.

అన్నిటిని పరిత్యజించి మోక్షానికి వెళ్లవలసిన ఒక యోగి, ఒకనాటి మండుటెండలో వెడుతూ ఎండకి ఓర్చుకోలేక,  ఒక చెప్పులు కుట్టే వాడు దారిలో పెట్టిన చెప్పులపై కొంత సేపు నిలబడ్డాడు.

ఆ మాత్రం నిలబడినందున, ఆ ఋణం తీర్చు కోవడానికి  మరుజన్మలో ధారానగరంలో పరమేశ్వరి, సోముడు - అనే దంపతులకు సునందుడు అను పేరుతో పుట్టాడు. 

జాతకం చూపిస్తే,  పెద్దలు ఆ తలిదండ్రులకు ఒక హెచ్చరిక చేస్తారు. 

ఈ బాలుడు మీకు చాలా చాలా తక్కువ రుణపడి ఉన్నాడు. 'వాడి చేతి నుంచి పైసా కూడా తీసుకోకండి. అతడికి మీరే అన్నీ ఇస్తూండండి' అని చెప్తారు. 

నాటినుంచీ తల్లిదండ్రులు వానినుంచి ఏమీ ఆశించకుండా పెంచుతారు. 

పూర్వజన్మ గుర్తున్నందున ఆపిల్లవాడు వారి రుణంతీర్చే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. 

ఒకరోజు రాత్రి రాజభటుడైన తన తండ్రికి బదులుగా తాను రాజనగరుకు కాపలా కాయవలసి వచ్చింది. అపుడు ప్రతి జాముకీ ఒకసారి ఆ యువకుడు నగరప్రజలను హెచ్చరిస్తూ హితవు ఒకటి చెబుతుండే వాడు. రాజుగారు మారువేషంలో తిరుగుతూ ఇవన్నీ విని ఇతడు సామాన్యుడు కాడని గుర్తిస్తాడు. మరునాడు స్వయంగా అతడి ఇంటికి వెళ్లి రాత్రి తాను అన్నీ విన్నాననీ, తన మనసు ప్రశాంతి పొందిందనీ అంటాడు. పళ్లెంలో వెంట తెప్పించిన ధనాన్ని అతడికి అందిస్తాడు. అతడు వెంటనేె ఆ ధన రాశిని తల్లికి ఇవ్వగా ఆమె పుత్రోత్సాహంలో,  నియమం మరచి ఆ పళ్లెం అందుకుంటుంది. వెంటనే అతడు తనువును విడిచి ముక్తి పొందుతాడు. తలిదండ్రులు దుఃఖిస్తే రాజు ఆ యువకుడు రాత్రి కావలి సమయంలో చెప్పిన ఈ క్రింది ఉపదేశాలు వినిపించి ఓదారుస్తాడు : 

1. మాతా నాస్తి, పితా నాస్తి, 

నాస్తి బంధు సహోదరః| 

అర్థం నాస్తి, గృహం నాస్తి, 

తస్మాత్ జాగ్రత  జాగ్రత|| 

తా:- తల్లి, తండ్రి, బంధువులు, అన్నదమ్ములు, ధనము, ఇల్లు ఇవి అన్నియు మిధ్యయే. ఇవి ఏవియు నిజముగా లేవు. కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి. 

2. జన్మ దుఃఖం, జరా దుఃఖం, 

జాయా దుఃఖం పునః పునః| 

సంసార సాగరం దుఃఖం 

తస్మాత్ జాగ్రత  జాగ్రత|| 

తా:- ఈ జన్మ, వృద్ధాప్యము, భార్య, సంసారము ఇవన్నియు దుఃఖ భరితములు. తిరిగి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. 

కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి. 

3. కామః  క్రోధశ్చ, లోభశ్చ 

దేహే తిష్ఠతి తస్కరాః| 

జ్ఞాన రత్నాపహారాయ 

తస్మాత్ జాగ్రత  జాగ్రత|| 

తా :-  కామము, క్రోధము, లోభము మొదలైన అరిషడ్వర్గములు మనలోని జ్ఞానమనెడు  విలువైన రత్నములను దొంగిలించుటకై మన దేహమునందు దాగియున్నదొంగలు. 

కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి. 

4. ఆశయా బధ్యతే జంతుః 

కర్మణా బహు చింతయా| 

ఆయుక్షీణం న జానాతి 

తస్మాత్ జాగ్రత  జాగ్రత|| 

తా:- ఈ మనుష్యులు ఎల్లప్పుడూ ఏదో ఆశకు, కర్మకు కట్టుబడి ఏవేవో ఆలోచనలతో,  జీవితాలు 

గడుపుతుంటారు. ఆయుర్ధాయం తరిగిపోతుందన్న విషయాన్ని గమనించరు. 

కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి. 

5. సంపదః స్వప్న సంకాశాః 

యౌవనం కుసుమోపమ్| 

విధుఛ్చచంచల ఆయుషం 

తస్మాత్ జాగ్రత  జాగ్రత|| 

తా:- మన సంపదలన్నియు ఒక కలవంటివి, అంటే అశాశ్వతాలు.  యౌవనం పూవుతో సమానం అంటే ఎపుడు వాడి నశిస్తుందో తెలియదు. ఆయుష్షు మెరుపుతీగవలె చంచలమైనది.  కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి. 

6. క్షణం విత్తం, క్షణం చిత్తం, 

క్షణం జీవితమావయోః| 

యమస్య కరుణా నాస్తి 

తస్మాత్ జాగ్రత  జాగ్రత|| 

తా:- ధనము, బుద్ధి, జీవితము ఇవన్నియు క్షణభంగురములు. మన ప్రాణములను హరించుటకై వేచియున్న యముడు ఏ మాత్రము దయ జూపడు. కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి. 

 *జై శ్రీమన్నారాయణ*

Related Posts