2 వేలుకు మించి విరాళమిస్తే కఠిన చర్యలు..
ఆదాయపుపన్ను శాఖ హెచ్చరిక
రాజకీయ పార్టీలకు నగదు రూపంలో రెండు వేల రూపాయలకు మించి విరాళం ఇవ్వొద్దని ఆదాయపు పన్ను శాఖ ప్రజలను హెచ్చరించింది. అలాకాదని అధిక మొత్తంలో నగదు రూపంలో విరాళాలను అందజేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన జారీ చేసింది. రాజకీయ నిధుల సేకరణ విధానాన్ని ప్రక్షాళన చేయడానికి ప్రభుత్వం ఎలక్టోరల్ బాండ్ల విధానాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఐటీ శాఖ ఈ మేరకు ప్రకటనను విడుదల చేసింది.
‘‘ ఏ రాజకీయ పార్టీకి నగదు రూపంలో రూ.2వేలకు మించి విరాళం ఇవ్వొద్దు. అలాగే స్థిరాస్తుల కింద రూ.20వేలకు మించి నగదు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చేయొద్దు. అలా చేస్తే భారీగా జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అని ఐటీ శాఖ ప్రకటనలో పేర్కొంది. ‘గో క్యాష్‌లెస్, గో క్లీన్’ పేరుతో ఐటీ శాఖ ఈ ప్రకటనను విడుదల చేసింది. అలాగే నల్లధన, బినామీ లావాదేవీలకు సంబంధించిన సమాచారం ఏదైనా తెలిస్తే మెయిల్ చేసి వివరాలు అందజేయాల్సిందిగా సూచించింది. అలాగే, ఒక వ్యక్తి రూ.2 లక్షల నగదు కంటే ఎక్కువ తీసుకోకూడదని, అంతకన్నా ఎక్కువ మొత్తాన్ని ఎవరూ కూడా ఇవ్వకూడదని ఆ ప్రకటనలో ఐటీ శాఖ పేర్కొంది.
రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాల్లో పారదర్శకత తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలక్టోరల రల్ బాండ్ల విధానాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. రాజకీయ పార్టీలకు విరాళాలిచ్చే దాతలు ఎస్‌బీఐ నుంచి ఈ బాండ్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. జనవరి, ఏప్రిల్, జులై, అక్టోబరు నెలల్లో ఎస్‌బీఐలోని ప్రత్యేక బ్రాంచీల వద్ద పది రోజుల పాటు ఈ బాండ్లను అమ్మడం జరుగుతోంది. పదిహేను రోజులు చెల్లుబాటు అయ్యే ఈ బాండ్లపై రుణదాత పేరు ఉండదు. కానీ రుణదాత ఆ బాండ్లను కొనుగోలు చేసే ముందు కేవైసీ పత్రాలను పూర్తి చేయాల్సి ఉంటుంది.