హైదరాబాద్, జూలై 26,
తెలుగు రాష్ట్రాల్లో నీటి వివాదం బీజేపీని ఇబ్బంది పెడతుంది. రెండు రాష్ట్రాలు నీటి వివాదాన్ని పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం వైపే చూస్తున్నాయి. దీంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఈ వివాదం తలనొప్పిగా మారే అవకాశముంది. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా రాజకీయంగా ఇబ్బందిగా బీజేపీకి మారనుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ల మధ్య నీటి వివాదం రోజురోజుకూ ముదురుతుంది.ఇద్దరు ముఖ్యమంత్రులు కలసి కూర్చుని సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన అంశాన్ని ఢిల్లీ వైపు నెట్టారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలుపదల చేయాలని తెలంగాణ, తెలంగాణలో అక్రమ ప్రాజెక్టులను కూడా నిలిపేయాని ఆంధ్రప్రదేశ్ పట్టుడుతున్నాయి. ఇద్దరూ కేంద్రాన్ని ఆశ్రయించారు. లేఖలు రాశారు. ఇప్పుడు పరిష్కారం బీజేపీ చేతుల్లో ఉంది. ఈ నీటి వివాదంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమే.అయితే ఆంధ్రప్రదేశ్ కు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే భవిష్యత్ లో ఇబ్బంది అవుతుంది. అక్కడ పార్టీ బలోపేతమయ్యే అవకాశాలు లేవు. జగన్ మీదనే ఆధారపడాల్సి ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో ఏదైనా మెజారిట ీ తగ్గితే జగన్ చేయూత బీజేపీకి అవసరమవుతుంది. అందుకే ఏపీని దూరం చేసుకుంటే అసలుకే ఎసరు వస్తుందన్నది బీజేపీ పెద్దల ఆలోచన. ఆంధ్రప్రదేశ్ కు నొప్పి పుట్టించకుండా నిర్ణయాలు తీసుకోవడమే బెటర్.మరోవైపు చూసుకుంటే తెలంగాణలో బీజేపీ బలోపేతం అవుతుంది. అధికారంలోకి వచ్చేంత కాకపోయినా పార్టీ భవిష‌్యత్ దక్షిణాదిలో కర్ణాటక తర్వాత తెలంగాణలో మాత్రమే ఉంది. నీటి వివాదంలో తెలంగాణకు వ్యతిరేకంగా తీసుకుంటే ఇక్కడ పార్టీ ఎదిగదు. మరో రెండేళ్లలో ఎన్నికలు ఉండటంతో తెలంగాణకు సానుకూలంగా నిర్ణయం తీసుకుంటేనే మంచిదన్న సూచనలు అక్కడి పార్టీ నేతల నుంచి అందుతున్నాయి. ఇలా రెండు రాష్ట్రాల్లో బీజేపీకి రాజకీయ ప్రయోజనాలు ఉండటంతో నీటి వివాదం ఆ పార్టీకి తలనొప్పిగా మారిందనే చెప్పాలి.