YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఆర్థికాభివృద్ధికి అవకాశం ఉండే రంగాల్లో దళితులకు రిజర్వేషన్లు

ఆర్థికాభివృద్ధికి అవకాశం ఉండే రంగాల్లో దళితులకు రిజర్వేషన్లు

హైదరాబాద్‌ జూలై 26

ఆర్థికాభివృద్ధికి అవకాశం ఉండే రంగాల్లో దళితులకు రిజర్వేషన్లు ఇష్టమైన రంగాల్లో ఉపాధి.. రక్షణకు ప్రత్యేకంగా నిధి  పట్టుదలతో స్వీయ అభివృద్ధికి పూనుకోవాలి  ముఖ్యమంత్రి కేసీఆర్‌.
ఆర్థికాభివృద్ధికి అవకాశం ఉండే రంగాల్లో దళితులకు రిజర్వేషన్లు కల్పించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. ఈ మేరకు రిజర్వేషన్లు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దళితబంధు పథకాన్ని త్వరలో పైలెట్‌ ప్రాజెక్టుగా హుజూరాబాద్‌లో ప్రారంభించనుండగా.. ఈ మేరకు నియోజకవర్గ దళితులు, ఉన్నతాధికారులతో సోమవారం ప్రగతి భవన్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ దళితులు ఆర్థికంగా పటిష్టమైన నాడే వివక్ష నుంచి దూరమవుతారన్నారు. పథకంపై రాష్ట్రవ్యాప్తంగా దళితులకు అవగాహన కల్పించాలని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తే దళితుల అభివృద్ధితో పాటు రాష్ట్రాభివృద్ధికి దారులు వేస్తుందన్నారు. నైపుణ్యం, ప్రతిభ ఉన్న దళితవర్గాన్ని అంటరానితరం పేరుతో ఉత్పాదక రంగానికి దూరం చేయడం బాధాకరమన్నారు. మహిళలను జెండర్‌ పేరుతో అనుత్పాదక రంగానికే పరిమితం చేయడం తెలివితక్కువ పని అన్నారు. మనలో నిమిడీకృతమై ఉన్న శక్తిని గుర్తించి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
విజయం సాధించాలంటే దళారులు, ప్రతీప శక్తులను దూరంగా ఉంచాలన్నారు. దళిత మహిళ మరియమ్మ లాక్‌డెత్‌ కేసులో దోషులుగా తేలిన పోలీసులను ప్రభుత్వం తొలగించిందని సీఎం కేసీఆర్‌ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం దళితులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని చెప్పారు. ప్రభుత్వమే స్వయంగా అండగా ఉన్నప్పుడు విజయం సాధించేందుకు దళిత సమాజం పట్టుదలతో స్వీయ అభివృద్ధికి పూనుకోవాలన్నారు. ప్రభుత్వ వర్గాలతో పని చేయించుకునే క్రమంలో ఇవాళ సదస్సులో పాల్గొన్న వారంతా డేగకన్నుతో పని చేయాలని సూచించారు. దళితబంధు పటిష్ట అమలుకు మమేకమై పనిచేయాలన్నారు.
ఎరువుల దుకాణాలు, మెడికల్‌ షాపులు, రైస్‌మిల్లులు, వైన్‌షాపులు.. ఆర్థికాభివృద్ధికి అవకాశం ఉండే రంగాల్లో దళితులకు ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పించనున్నట్లు తెలిపారు. పవర్‌ టిల్లర్‌, హార్వెస్టర్‌, వరినాటు వంటి వ్యవసాయ యంత్రాలు, ఆటోలు, ట్రాక్టర్‌లు, కోళ్ల పెంపకం, టెంట్‌హౌస్‌, ఆయిల్‌, పిండి మిల్లులు, సిమెంట్‌ ఇటుకల తయారీ పరిశ్రమ, స్టీల్‌ వంటి బిల్డింగ్‌ మెటీరియల్‌ దుకాణాలు, ఫొటో.. వీడియోగ్రఫీ, సెల్‌ఫోన్‌ షాప్స్‌, హోటల్స్‌, క్లాత్‌ ఎంపోరియం, ఫర్నీచర్‌ దుకాణాలు వంటి ఉపాధి, పరిశ్రమ, వ్యాపార రంగాలను బట్టి ఇష్టాన్ని బట్టి.. దళితబంధు పథకం ద్వారా అర్హులైన వారికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. దళితబంధు పథకం ద్వారా అందించే ఆర్థిక సాయానికి అదనంగా ప్రభుత్వ లబ్ధిదారుల భాగస్వామ్యంతో శాశ్వత ప్రాతిపదికన దళిత రక్షణ నిధి ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. రక్షణ నిధి కలెక్టర్ల పర్యవేక్షణలో లబ్ధిదారులతో కమిటీ నిర్వహించబడుతుందన్నారు. ప్రతి ఏటా కనీసం డబ్బును జమ చేస్తూ దళిత రక్షణ నిధిని నిరంతరాయంగా కొనసాగించనున్నట్లు వెల్లడించారు. ఆర్థికంగా పటిష్టంగా నిలదొక్కుకునే దిశగా రక్షణనిధిని వినియోగించనున్నట్లు తెలిపారు.
ఎవరి సహకారం లేక బాధపడుతున్న దళితులకు ఈ పథకం బాటలు వేస్తుందన్నారు. దళితుల విజయం ఇతర కులాలు, వర్గాలకు.. పక్క రాష్ట్రాలకు మాత్రమే కాదు.. దేశానికే వెలుతురు ప్రసరింపజేస్తుందన్నారు. దళితులు విజయం సాధించి వెలుగు దివ్వెలు.. కరదీపికలుగా మారాలని పిలుపునిచ్చారు. హుజూరాబాద్‌ గెలుపు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలువాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఈ విజయం రాష్ట్ర, దేశవ్యాప్తంగా ప్రసరించాలనదే తన ఆకాంక్ష అని పేర్కొన్నారు.

Related Posts