YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

కర్ణాటక సీఎం రాజీనామా... ఇవాళ కొత్త సీఎం ఎంపిక

కర్ణాటక సీఎం రాజీనామా... ఇవాళ కొత్త సీఎం ఎంపిక

కర్ణాటక సీఎం రాజీనామా...
ఇవాళ కొత్త సీఎం ఎంపిక
బెంగళూర్, జూలై 26
 కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప తన రాజీనామాపై ఉత్కంఠ తొలగిపోయింది. అన్ని ఊహాగానాలకు తెరదించుతూ ముఖ్యమంత్రి యడియూరప్ప పదవికి రాజీనామా సమర్పించారు. సీఎం పదవికి రాజీనామా చేసినట్టు సోమవారంనాడు ఆయన ప్రకటించారు. తద్వారా మరొకరు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టడానికి మార్గం సుగమమవుతుందని అన్నారు. తన రాజీనామా లేఖను రాజ్‌భవన్‌కి వెళ్లి గవర్నర్‌ని కలిసిన బీఎస్ యడియూరప్ప లేఖను అందజేశారు.భారతీయ జనతా పార్టీ రెండేళ్ల పాలన విజయవంతంగా పూర్తి చేసుకున్న తరుణంలో ఆయన రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ తావర్ చంద్ గెహ్లాట్‌ను రాజ్‌భవన్‌లో కలుసుకుని తన రాజీనామా పత్రాన్ని ఆయనకు సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, తన రాజీనామాను గవర్నర్ ఆమోదించినట్టు చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని తిరిగి అధికారంలోకి తీసుకు వచ్చేందుకు తాను పనిచేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సిందిగా తనపై ఎవరి ఒత్తడి లేదని, రాజీనామా నిర్ణయం తన సొంత నిర్ణయమని బీఎస్ యడియూరప్ప చెప్పుకొచ్చారు.అయితే, యడియూరప్ప రాజీనామా ప్రకటనతో నాయకత్వ మార్పు తప్పదనే స్పష్టత వచ్చేసింది. దీంతో ఇక కర్ణాటకకు కాబోయే కొత్త సీఎం ఎవరు అనే ప్రశ్నే ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనియాంశమైంది. రాష్ట్రంలో బీజేపీ సర్కారు రెండేళ్లు పూర్తి చేసుకున్న రోజే సీఎం పీఠం నుంచి ఆయన వైదొలిగారు. దీంతో కర్ణాటకలో కొత్త నాయకత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కమల దళం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. అయితే, 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని యువ నేతకు పగ్గాలు అప్పజెప్పాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం.ఇదిలా ఉండగా.. కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి రేసులో పలువురు నేతల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇందులో రాష్ట్ర హోంమంత్రి బసవరాజ్‌ బొమ్మై పేరు ప్రధానంగా వినిపిస్తోంది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ఆర్‌ బొమ్మై కుమారుడు బసవరాజు. ఈయనకు సీఎం పదవి ఇవ్వాలని యడియూరప్ప సిఫార్సు చేసినట్లు రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, తాను ఎవరి పేరు సూచించలేదని యడ్డీ స్పష్టం చేశారు. ఇక, రాష్ట్ర గనుల శాఖ మంత్రి మురుగేశ్‌ నిరాణి, జగదీష్ షట్టర్, ఎమ్మెల్యే అరవింద్‌ బెల్లాడ్‌, విజయపుర ఎమ్మెల్యే బసన్నగౌడ పాటిల్ యత్నాల్ కూడా సీఎం రేసులో ఉన్నారు. వీరంతా కర్ణాటకలో బలమైన సామాజిక వర్గం లింగాయత్‌ వర్గానికి చెందినవారే కావడం విశేషం. రాష్ట్రంలో బీజేపీ ఓటు బ్యాంకులో లింగాయత్‌లదే అధిక వాటా. యడియూరప్ప కూడా లింగాయత్‌ వర్గానికి చెందినవారే. దీంతో వీరిలో ఒకరు సీఎం అయ్యే అవకాశాలున్నట్లు రాజకీయ వర్గాల్లో వినికిడి. కాగా, ఇటీవల లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన కొందరు మతగురువులు సమావేశమై.. బీజేపీ అధిష్టానానికి యడ్డీయూరప్పను కొనసాగించాలని అల్టిమేటం కూడా జారీ చేశారు. కాగా, యత్నాల్‌కు ఆర్‌ఎస్‌ఎస్ బలమైన మూలాలున్నాయని, కేంద్ర మంత్రిగా ఆయనకున్న అనుభవం ఆయనకు మేలు చేస్తుందని రాజకీయ వేత్తలు భావిస్తున్నారు. వాస్తవానికి, అతను ఉత్తర కర్ణాటకలో ప్రాచుర్యం పొందాడు. అంతేకాదు వెనుకబడిన కుల సమూహానికి కోటా కోరుతూ పంచమ్‌సలి లింగాయత్‌లు ఈ ఏడాది ప్రారంభంలో చేసిన ఆందోళనలో ముందంజలో ఉన్నారు. ఆయనను ప్రధాని నరేంద్ర మోడీ ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.అయితే 2023లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇతర వర్గాల్లోనూ ఓటు బ్యాంకును పెంచుకోవాలని కాషాయ పార్టీ యోచిస్తోంది. ఈ క్రమంలోనే ఆయా వర్గాల నుంచి బలమైన నాయకత్వం కోసం ఎదురుచూస్తోంది. దీంతో ఈ సారి ఓబీసీ లేదా ఒక్కళిగ వర్గం నుంచి సీఎంను ఎంపిక చేసే అవకాశాలు కూడా కన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి, కర్ణాటక ఉపముఖ్యమంత్రి అశ్వత్‌ నారాయణ్‌, కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషీ, రాష్ట్ర చీఫ్‌ విప్‌ సునిల్‌కుమార్‌ పేర్లు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. తదుపరి ముఖ్యమంత్రి ఎంపికపై బీజేపీ అధిష్టానం మంగళవారం ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.ఇక, యడియూరప్ప స్థానంలో లాబీయింగ్ చేస్తున్నారన్న వార్తలను ఖండించిన నిరానీ, బీజెపీ కేంద్ర నాయకత్వం తీసుకునే ఏ నిర్ణయానికైనా తాను కట్టుబడి ఉంటానని చెప్పారు. తాను సాధారణ బీజెపీ కార్యకర్తనని, పార్టీ ఆదేశాలను పాటించడం తన కర్తవ్యం అన్నారు. పదిహేను రోజుల క్రితం ఢిల్లీకి వెళ్లి.. తన పర్యటనను ‘విజయవంతం’ అని పేర్కొన్న నిరానీ, యడీయూరప్పకు తన మద్దతు ఉంటుందని పునరుద్ఘాటించారు.అయినప్పటికీ , పార్టీ హైకమాండ్ నుండి ఇప్పటివరకు తనకు ఎటువంటి సందేశం రాకపోవడంతో యడీయూరప్ప సీఎం పదవికి రాజీనామా చేయక తప్పలేదు. కాగా, మంగళవారం భారతీయ జనతా పార్టీ అధిష్టానం సమావేశమైన కొత్త ముఖ్యమంత్రి పేరును ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు, కర్ణాటక పరిస్థితులను చక్కదిద్దేందుకు కేంద్ర పార్టీ పరిశీలకులుగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కర్ణాటక బీజెపీ ఇన్‌ఛార్జి అరుణ్ సింగ్‌లను నియమించే అవకాశముంది.
ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా యడ్డీ
న్ని నెలల సస్పెన్స్ అనంతరం కర్ణాటక సీఎం ఎడ్యూరప్ప రాజీనామా చేశారు. ఇక కొత్త ముఖ్యమంత్రిగా ఎవరిని ఎంపిక చేస్తారన్నది తెలియాల్సి ఉంది. తన రాజీనామా గురించి సోమవారం ఆయన ప్రకటిస్తున్నప్పుడు భావోద్వేగంతో కంట తడి పెట్టారు. తాను బీజేపీని వీడడం లేదని, పార్టీ కార్యకర్తగా కొనసాగుతానని అన్నారు. ప్రజలకు ఇన్నేళ్లు సేవ చేసేందుకు తనకు అవకాశమిచ్చిన పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు. నన్ను రాజీనామా చేయమని ఎవరూ ఒత్తిడి చేయలేదు.. నేనే చేస్తున్నా…వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ఈ ఈ రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కృషి చేస్తా అని ఆయన చెప్పారు. ఇక కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేసేందుకు బీజేపీ కర్ణాటకకు పరిశీలకుల (అబ్జర్వర్ టీమ్) బృందాన్ని పంపాలని నిర్ణయించింది. ఒకటి రెండు రోజుల్లో ఈ బృందం బెంగుళూరు చేరుకోనుంది.పార్టీ లెజిస్లేచర్ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ సమావేశంలో కొత్త వారసుని సెలెక్ట్ చేయాల్సి ఉంది. బహుశా ఈ వారాంతంలోగా ఈ ప్రక్రియ పూర్తి కావచ్చునని భావిస్తున్నారు. అంతవరకు ఎడ్యూరప్ప ఆపద్ధర్మ సీఎంగా కొనసాగుతారు.కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నేతృత్వాన పరిశీలకుల బృందం నగరానికి రానున్నట్టు తెలుస్తోంది. ఇక తన రాజీనామాను గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ కి సమర్పించిన అనంతరం ఎడ్యూరప్ప..తన 50 ఏళ్ళ పొలిటికల్ కెరీర్ లో ప్రజలకు సేవ చేయవలసి రావడం తన అదృష్టమని పేర్కొన్నారు. బీజేపీకి తాను విశ్వాస పాత్రుడిగా ఉంటానన్నారు. తనను సమర్థించిన లింగాయత్ లకు ఆయన ధన్యవాదాలు తెలియజేస్తూ… కొత్త ముఖ్యమంత్రికి కూడా మీరు ఇలాగే మద్దతునివ్వాలని కోరారు. అటు రాష్ట్రంలో అవినీతికర ప్రభుత్వం గద్దె దిగడం సంతోషకరమని ఎడ్యూరప్ప వ్యతిరేక వర్గం పేర్కొంది. ఆయన ఇద్దరు కొడుకులూ పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ వచ్చారని, ఇక వారి ఆటలు చెల్లు అని ఈ వర్గం వ్యాఖ్యానించింది.

Related Posts