భారతదేశంలో పశ్చిమ కనుమలలో, ఆరావళి పర్వతాల శిఖరాల వరుసలో ఉన్నతమైన శిఖరంగా పేరు పొందినది మౌంట్ అబూ. అద్భుత పర్వతం అనే పేరు కూడా వుండేది. అతి ప్రాచీనమైన ఈ శిఖరానికి ఒక పౌరాణిక గాధను చెపుతారు. పరమశివుని వాహనమైన నంది ఒక సారి ఆకాశ మార్గాన ఈ శిఖరం మీదుగా వెడుతుండగా పర్వతశిఖరం నంది కాళ్ళకు తగిలి పడిపోయింది. అప్పుడు ఆ పర్వతం మీద వున్న అద్భుతం అనే నాగము నందీశ్వరుని కాపాడింది. ఆ నాగము యొక్క పేరు యీ పర్వతానికి వచ్చి అద్భుత పర్వతం అని పిలవబడి కాలక్రమేణా మార్పులు చెంది అబూ పర్వతం అనే పేరు వచ్చింది. ఇక్కడ నుండి 11 కి.మీ పర్వత మార్గంలో పయనిస్తే అచల్గఢ్ అనే ప్రాంతానికి చేరుకుంటాము. ఇక్కడ మహారాణా కుంభా కట్టించిన ముఫ్ఫై రెండు కోటలలో ఒకటైన అచల్గఢ్ కోట వున్నది. అయితే ఈనాడు పర్వతం మీద శిధిలావస్థలో వున్నది. ఈ కొండచరియలలో అచలేశ్వర మహాదేవ్ ఆలయం వున్నది. ఈ దేవాలయం క్రీ.శ. 813 లో నిర్మించబడినది. ఆలయ ద్వారం ముందు పెద్ద ఇత్తడి నంది విగ్రహం దర్శనమిస్తుంది. సమీపమున దీనిని నిర్మించిన మహారాజు యొక్క శిల్పం కూడా వున్నది. గర్భగుడిలోకి వెళ్ళడానికి సొరంగ మార్గంగా వెళ్ళాలి. అక్కడ కాలి బ్రొటనవేలంత శివలింగం కనిపిస్తుంది. దీనికి ఒక ఐహీకం వున్నది. దీనిని నిర్మించిన రాజు మహాశివ భక్తుడు. తల్లి యందు అమితమైన ప్రేమాభిమానాలు గౌరవం కలవాడు. కాశీకి వెళ్ళి విశ్వనాధుని దర్శించాలని కోరిక కలిగిన ఆయన తల్లి వయోభారం వలన వెళ్ళలేక విచారిస్తూండగా తల్లి దుఃఖం చూడలేని ఆ రాజు పరమశివుని మనసు కరిగేలా వేడుకున్నాడు. తన భక్తుని కోరికను కరుణించి కాశీ విశ్వనాధుడు తన కుడి కాలు బ్రొటన వేలు భూమిలో త్రొక్కిపెట్టగా అది పాతాళాన్ని దాటుకుని యీ ప్రాంతంలో పైకి వచ్చి ప్రత్యక్షమయింది. అది చూసిన మహారాజు ఆనందంతో అచలేశ్వరుడనే పేరుతో అక్కడే ఒక ఆలయం నిర్మించాడు. తన తల్లి ని తీసుకుని వచ్చి దర్శనం చేయించాడు. ఈ ఆలయానికి సంవత్సరం పొడుగునా యాత్రీకులు వచ్చి అచలేశ్వరుని దర్శించుకుంటారు. ఈ అచలేశ్వర దర్శనం వలన కాశీకి వెళ్ళి వచ్చిన పుణ్యం దక్కుతుందని అంటారు. వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో |