YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

మహర్షుల దివ్య చరిత్రలు జడ మహర్షి

మహర్షుల దివ్య చరిత్రలు  జడ మహర్షి

పూర్వం భార్గవుడనే బ్రాహ్మణుడుండేవాడు . ఆయన సమస్త వేద శాస్త్రాలు నేర్చుకున్నాడు . మంచి వాళ్ళకే మంచివాడు . ఈ భార్గవుడి కొడుకే జడ మహర్షి జడ మహర్షి పుట్టాక ఆయనకి జాతకర్మ , చెవులు కుట్టించడం , ఉపనయనం లాంటి చెయ్యవలసినవన్నీ పూర్తిచేశాడు భార్గవుడు . ఒకనాడు కొడుకుని పిలిచి నువ్వు వెళ్ళి ఒక గురువుగార్ని ఆశ్రయించి విద్య నేర్చుకుని గృహస్థుడవై సంతానాన్ని కని వానప్రస్థాశ్రమానికి వెళ్ళి తపస్సు చేసుకుని అన్నీ పరిత్యజించి , నిర్మోహివి , నిర్జితేంద్రియుడివి నిరంకారివి , నిర్మత్సరుడివి , నిత్యోపవాసివి అయి జీవించమని చెప్పాడు . కాని జడ మహర్షి మాట్లాడలేదు . తండ్రి చాలా సార్లు అడిగాక తండ్రీ ! నువ్వు చెప్పినవి చాలా జన్మల్లో చేశాను . నేను ఇప్పటికి అయిదువేల జన్మలెత్తాను . అన్ని రకాలయిన దుఃఖాలు అనుభవించాను . పుత్ర , మిత్ర , కళత్ర , శత్రు , భ్రాతృ వియోగాలన్నీ అనుభవించాను . కొన్ని వేలమంది తల్లుల పాలు త్రాగాను . బాల్యం , యౌవనం , ముసలితనం అన్నీ నాకు తెలుసు . ఎన్నిసార్లో పుట్టాను . ఎన్నిసార్లో చచ్చాను . ఇప్పుడు నీకు కొడుకుగా పుట్టాను . నేను జ్ఞానినై పుట్టాను . నువ్వు చెప్పేవేవీ నా మనసులోకి వెళ్ళవు . జడుడు అనే పేరు నాకు సరిపోతుంది కూడా ... అన్నాడు . అన్నీ విని భార్గవుడు కుమారా ! నీకీ జడత్వం ఎందుకు వచ్చింది ? ఇంత విజ్ఞానం వుంది కదా ... నీకేమయినా శాపం వుందా ... వివరంగా చెప్పమన్నాడు . నేను పూర్వజన్మలో బ్రాహ్మణుణ్ణి  చాలా మంది శిష్యులకి జ్ఞానోపదేశం చేసిన గురువుని . అజ్ఞానమనే చీకటిని పోగొట్టుకుని , ఎవరికీ దొరకని జన్మజన్మలు గుర్తు చేసుకోగలిగిన జ్ఞానం ఈ జన్మలో పొందాను . నేను ఇంక మోక్షానికి దారి వెతుక్కోవాలి . నీకేమైనా సందేహాలుంటే అడుగు అవి తీర్చి వెళ్ళిపోతానన్నాడు జడ మహర్షి భార్గవుడు కొడుకుని చూసి ఆశ్చర్యంతో గర్భంలో వుండగానే జ్ఞానివైన నిన్ను కన్న మేము ఎన్నినోములు నోచి ఉంటామో ! ఇల్లాంటి కులదీపంలాంటి కొడుకుని పొందే అదృష్టం ఎంతమందికి దక్కుతుంది ? నేను నిన్ను గురువుగా అనుకొని కొన్ని ప్రశ్నల అడుగుతాను , సమాధానం చెప్పమని ఇలా అడిగాడు భార్గవుడు . ప్రాణికి పుట్టడం , బ్రతకడం , మరణించడం ఇవి ఎలా జరుగుతున్నాయి ? ఎలా పుడుతున్నాడు ? ఎలా చచ్చిపోతున్నాడు ? ఎలా పాపపుణ్యాలు అనుభవిస్తున్నాడు ? జ్ఞానం ఎలా పొందుతున్నాడు ? అని అడిగాడు . జడ మహర్షి తండ్రిగారూ ! మొదట మనిషి మరణించే విధం చెప్తాను వినండి . మరణకాలం వచ్చినప్పుడు శరీరం బాగా వేడెక్కి ఆవిర్లు వస్తాయి . మలమూత్రాలు బయటికి వచ్చే దారులు మూసుకుపోయి మలమూత్రాలు రావడం ఆగిపోతుంది . పొట్ట పెరిగి పెదవులు ఎండి , గొంతు తడి ఆరిపోయి , మాటపడిపోయి , కళ్ళు జీవం లేనట్లయి , నాలుక వెనుకకి లాక్కుపోయి , శ్వాసాగిపోతుంది . ధర్మం తప్పనివాడు , అన్నం నీళ్ళు దానం చేసి పెద్దలని గౌరవించి , అసూయ లేకుండా , అసత్యం పలకకుండా ఉన్నవాడు సుఖంగా మంచిగా మరణిస్తాడు . అలా మంచిగా వుండని వాడు బాధపడూ , కష్టపడూ మరణిస్తాడు . మరణించాక తల్లిదండ్రుల వల్ల వచ్చిన శరీరం పోయి , వారివారి పనులు , వయస్సు , రూపాన్ని బట్టి జీవులు యాతనా శరీరాల్లో ప్రవేశిస్తారు . ఇలా పాపం చేసిన వాళ్ళ యాతనా శరీరాల్ని యమభటులు కాళ్ళు చేతులు కట్టేసి కర్రలతో కొడూ , వేడి నేలమీద ఈడ్చుకుంటూ , రాళ్లు , గుట్టలు , ముళ్ళు గల భయంకరమైన మార్గంలో నక్కలు పిక్కలు కొరికి తింటూ వెంట వస్తూ ఉండగా తీసికెడతారు . ఇలా తీసుకెడుతూ వుండగా బంధువులు మిత్రులు అతని దేహాన్ని కాలుస్తుంటే ఆ వేడికి తట్టుకోలేక బాధపడ్డాడు . పన్నెండు రోజుల వరకు బంధువులు చేసే పిండప్రదానాలు , భూమిమీద పడుకునే ముఖ్య వ్రతం వల్ల యాతనా శరీరం తృప్తిపడుతుంది . పన్నెండవ రోజు మైలస్నానాలు , తర్పణాలు ఇలాంటి వాటి వల్ల యాతనా శరీరం సంతోషపడుతుంది . పదమూడో రోజు జీవిని యమధర్మరాజు దగ్గరకి తీసుకెడతారు . చిత్రగుప్తుడి దగ్గర పాపాల పట్టీ ఉంటుంది కదా ... అది చూసి యమధర్మరాజు శిక్ష వేస్తాడు . వాటి గురించి కొన్ని తెలుసుకుందాం . రౌరవం : ఇది ఉండే ప్రదేశం రెండువేల యోజనాలు . అదంతా ఎర్రటి నిప్పులు భగభగమంటూ ఉంటాయి . అందులో వేస్తే కాలి బూడిద అవడం మళ్ళీ మామూలు అవడం ఇలా జరుగుతూనే ఉంటుంది . మహారౌరవం : ఇది ఎన్నో వేల యోజనాలు . ఇందులో యమభటులు పాపాలు చేసినవాళ్ళని కాళ్ళు , చేతులు కట్టి పడేస్తే కుక్కలు , నక్కలు , పాములు గ్రద్దలు ఒకటేమిటి అన్ని కలిసి పొడిచి కఱచి మాంసం ఎముకలు నమిలి నమిలి బాధ పెడ్తాయి . తమో నరకం : ఇది అతి చల్లగా ఉంటుంది . కాళ్ళు , చేతులు కొంకర్లుపోయి ఒకళ్ళరక్తం ఒకళ్ళు తాగేస్తారు . నికృంతం : దీంట్లో చక్రాలు తిరుగుతూ శరీరాల్ని ముక్కలుగా చేస్తుంటే మళ్ళీ అవి అతుక్కుంటూ అవి మళ్ళీ ముక్కలవుతూ ఆచక్రంలో తిరుగుతూనే ఉంటారు . 

అప్రతిష్ఠ నరకం : పేగులు పిండి మెడలు వేల్లాడుతూ రక్తాలు కారుతున్న కళ్ళతో రాట్నాలమీద వేలవేల సంవత్సరాలు త్రిప్పించబడతారు .

 అసిపత్రవనం : ఇది కొన్ని వేల యోజనాల్లో వున్న ప్రదేశం . ఇది చాలా చల్లగా వుండి , ఆకులు , పూవులు లాంటి కత్తులతో వున్న చెట్లతో వుంటుంది . పాపాత్ములని దీంట్లో పడేయ్యగానే ఆ కత్తులు నరికేస్తూ ఉంటాయి . పెద్ద పెద్ద కుక్కలు అవి నోటితో పట్టుకుని తిరుగుతూ ఉంటాయి . 

తప్తకుంభ నరకం : ఎప్పుడూ మండుతూ వుండే మంటలమీద పెద్ద పెద్ద కుండల్లో సలసలకాగే నూనెలో తలక్రిందులుగా పడేస్తారు . 

అమితకర్ధమ : ఈ నరకంలో పెద్ద పెద్ద పక్షులు ఇనపముక్కులతో పొడుస్తూ వుంటే విపరీతమైన ఆకలి దాహంతో రక్తం కారుతూ అరుస్తూ ఉంటారు . ఇలాంటి నరకాలు ఎన్నో ఉన్నాయని చెప్పాడు జడ మహర్షి . భార్గవుడు మళ్ళీ ఏ పాపాలు చేస్తే ఏ జన్మ వస్తుందో వివరంగా చెప్పమన్నాడు జడ మహర్షిని .

నరక బాధలు అనుభవించిన తర్వాత వాళ్ళ జన్మలు ఎలా ఉంటాయో విపులంగా చెప్తాను విను అన్నాడు జడ మహర్షి . కడజాతి వాడి నుంచి దానం తీసుకున్న బ్రాహ్మణుడు గాడిదగాను , అతనికి సహాయం చేసినవాడు పురుగుగాను పుడతారు . గురువుని మోసగించిన వాడు కుక్క గురువు భార్యతో కలసిన వాడు గాడిద , తల్లిదండ్రులు చెప్పినట్లు విననివాడు గోరువంక , వాళ్ళకి మనోవ్యాధి కలిగించినవాడు తాబేలు , ఒకరి ఉప్పు తిని తర్వాత శతృవర్గంలో చేరినవాడు కోతి , విశ్వాసహీనుడు చేపగాను , అసూయకలవాడు డేగగాను , ధనం లాంటివి దొంగతనం చేసినవాడు కొంగగానూ , మిత్రుడి భార్యతో కలిసిన వాడు పంది , యజ్ఞం , దానం , వివాహం చేసేటప్పుడు విఘ్నం కలిగించినవాడు , కూతుర్ని ఒకరికిచ్చి పోట్లాడి మళ్ళీ వేరే పెళ్ళి చేసినవాడు పురుగులు గాను , దేవతలకి , పితరులకి , అతిథులకి ముందు అన్నం పెట్టకుండా తానే తినేవాడు కాకి , బ్రాహ్మణుడు శూద్రస్త్రీతో వెడితే కట్టెలోని పురుగుగాను , కృతజ్ఞతలేని వాడు పురుగు , తేలు , చేపగాను , ఆడవాళ్ళని పిల్లలని చంపినవాడు పురుగుగాను , అన్నం దొంగతనం చేసినవాడు ఈగగాను ఇలా రకారకాలుగా పుడతారు . పాపం పూర్తి అయ్యేవరకు మనుష్య జన్మ రాదని చెప్పాడు . మరి పుణ్యం చేసుకున్న వారి గురించి చెప్పనే లేదని భార్గవుడు అడిగితే జడ మహర్షి పుణ్యం చేసుకున్న వాళ్ళ సంగతి కూడా చెప్తున్నాడు . వాళ్ళు దివ్యాభరణాలు , దివ్యాంబరాలు , దివ్య సుగంధాలు అనుభవిస్తూ విమానంలో స్వర్గానికి వెళ్ళి అక్కడ స్వర్గసుఖాలు అనుభవించి పుణ్యం అయిపోగానే మళ్ళీ మనిషి జన్మ ఎత్తుతారని చెప్పాడు . భార్గవుడు కుమారా ! గర్భం లోకి మనిషి ఎలా ప్రవేశిస్తాడు ? ఎలా పెరుగుతాడు ? వివరంగా చెప్పమన్నాడు . స్త్రీ పురుషులు కలిసే సమయంలో పరలోకానికి వెళ్ళిపోయిన జీవుడు చాలా వేగంగా గాలి రూపంలో శుక్లంలో కలుస్తాడు . అది మావిగా పిండంగా మారుతుంది . తర్వాత పంచాంగాలు , ఉపాంగాలు పుడతాయి . అన్ని అవయవాలు పెరిగి ఒక బొటన వ్రేలిమీది ఒకటి వేసుకుని తొడల ప్రక్కన చేతులు పెట్టి , చేతులు మోకాళ్ళ పైన , కళ్లు మోకాళ్ళ వెనుక , ముక్కు మోకాళ్ళ నడుమ భాగంలో , రెండు పిక్కలు దగ్గరకి చేర్చి బాగా ముడుచుకుపోయి మోకాళ్ళ మధ్య ఉండగా ఆ తల్లి కడుపులో వేడిని భరిస్తూ , ఆమె తీసుకునే ఆహారం శరీరాన్ని పెంచుతుండగా పుణ్యపాపాలు అతన్ని ఆశ్రయించడం చేత అతనికి జ్ఞానం కలుగుతుంది . తొమ్మిది మాసాలు నిండిన తర్వాత శిశువు రూపంలో బయటికి వచ్చి ఏడుస్తాడు . మిగిలింది మామూలే మీకు తెలిసిందే కదా ... భార్గవుడు చేతులు జోడించి యోగీంద్రా ! మోక్షాన్ని పొందడానికి యోగవిద్యని కూడా నువ్వే ఉపదేశం చెయ్యమన్నాడు .

జడ మహర్షి ఇలా చెప్పాడు . యోగి అవమానం అమృతంలా , గౌరవం విషంలా , మాట ఎప్పుడు సత్యాన్ని చెప్పేదిగా , తలపులు బుద్ధిగా ఉండి బ్రహ్మచర్యాన్ని అవలంబిస్తూ తన ఆత్మని పరమాత్మమీద నిలిపి లోకంలో పరమాత్మ తప్ప యింకేమి లేదన్నట్లుగా ధ్యానం చేసుకుంటూ పరమాత్మని అనుభవించగలిగిననాడు మోక్షం కలుగుతుందని చెప్పి తాను కూడా యోగ సాధన కోసం వెళ్ళిపోయాడు . 

*Note:- మహర్షుల దివ్య చరిత్రను ఫార్వర్డ్ చేసి ప్రతి ఒక్క హిందూ చేత చదివిద్దాం. ఆ మహర్షుల దివ్య ఆశీస్సులు పొందు దాము*

వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో

Related Posts