హైదరాబాద్, జూలై 27,
కరోనా వల్ల గత ఏడాదిన్నర కాలం నుంచి దేశంలోని స్కూళ్లన్నీ మూత పడి ఉన్న విషయం విదితమే. ఈ క్రమంలోనే ప్రైవేటు స్కూళ్ల ఆదాయం 20-50 శాతానికి పడిపోయింది. చాలా మంది ఉపాధ్యాయులకు సగం జీతాలనే ఇస్తున్నారు. ఈ మేరకు ఓ నివేదికలో వివరాలను వెల్లడించారు. సెంట్రల్ స్క్వేర్ ఫౌండేషన్ (సీఎస్ఎఫ్) అనే ఎన్‌జీవో సంస్థ దేశంలోని 20 రాష్ట్రాల్లో సర్వే చేసింది. ఈ క్రమంలోనే పలు వివరాలను వెల్లడించింది.
ఈ ఏడాది స్కూళ్లలో 55 శాతం వరకు వాటిలో కొత్త అడ్మిషన్లు లేవని నివేదికలో వెల్లడించారు. అలాగే నాలుగింట మూడు వంతుల స్కూళ్లకు రీయెంబర్స్‌మెంట్ సదుపాయాన్ని అందించడంలో తీవ్రమైన జాప్యం జరుగుతుందని తేలింది. ఇక మొత్తం స్కూళ్లలో 77 శాతం మంది తమ స్కూల్ ఖర్చుల కోసం లోన్లు తీసుకునేందుకు సిద్ధంగా లేరని వెల్లడైంది.ప్రైవేటు స్కూళ్లలో లాక్‌డౌన్ సందర్భంగా 55 శాతం మంది టీచర్లకు సగం వేతనాలనే అందించారు. ఇప్పటికీ ఇంకా 65 శాతం మందికి జీతాలు పెండింగ్‌లో ఉన్నాయి. 54 శాతం మంది టీచర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గం లేదు. 30 శాతం మంది వేతనాలు సరిపోక పోవడంతో ట్యూషన్లు చెప్పుకుంటూ జీవిస్తున్నారు.ఇక 55 శాతం మంది టీచర్లు త్వరలో పరిస్థితులు మెరుగు పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గతేడాది ఫీజులనే 70 శాతం స్కూళ్లు ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్నాయని తల్లిదండ్రులు తెలిపారు. 30 శాతం స్కూళ్లలో ఫీజులు పెరిగినట్లు నిర్దారించారు. ఇక తమ పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు టెక్నాలజీ పరంగా ఈసారి 15 శాతం ఎక్కువ ఖర్చు పెట్టారని.. నివేదికలో వెల్లడైంది. అయితే రానున్న రోజుల్లో చిన్న, మధ్య తరగతి ప్రైవేటు స్కూళ్లు, టీచర్ల పరిస్థితి ఎలా ఉంటుందన్నది తెలియాల్సి ఉంది.