బెంగళూర్, జూలై 27,
సీఎం పదవికి యడియూరప్ప రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో కర్ణాటక రాష్ట్రంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఆయన రాజీనామాతో నెక్ట్స్ సీఎం ఎవరు అవుతారనే చర్చ మొదలైంది. అయితే.. లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన యడియూరప్పతో రాజీనామా చేయిస్తున్న నేపథ్యంలో అదే వర్గానికి చెందిన మరో సీనియర్ ఎమ్మెల్యేకు సీఎం పదవి కట్టబెట్టేందుకు అధిష్టానం కసరత్తు చేస్తోంది.దీంతో పలు కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. కర్నాటక సీఎంగా రాజీనామా చేసిన యడియూరప్ప గవర్నర్ ను కలిసి అధికారికంగా పత్రం సమర్పిస్తారు. అనంతరం కొత్త సీఎంను ఎన్నుకునేందుకు బీజేపీ శాసన సభాపక్షం సమావేశం కానుంది. ఇందులో బీజేపీ అధిష్టానం సూచించిన ఎమ్మెల్యేను మిగతా ఎమ్మెల్యేలు శాసన సభాపక్ష నేతగా ఎన్నుకోబోతున్నారు. ఇక ఇప్పటికే 8 మందితో ఓ జాబితా తయారు చేసిన అధిష్టానం.. వీరిలో ఒకరిని ముఖ్యమంత్రి గా ఎంచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. యడియూరప్ప వారసుడిగా ఎవరు ఎంపిక అవుతారో చూడాలి.