ఫైజర్, ఆస్ట్రాజెనికా టీకాలు తీసుకున్న వారిలో తగ్గుతున్నట్లు యాంటీబాడీల సంఖ్య
న్యూ ఢిల్లీ జూలై 27;: ఫైజర్, ఆస్ట్రాజెనికా టీకాలు తీసుకున్న వారిలో ఆరు వారాల తర్వాత యాంటీబాడీల సంఖ్య తగ్గుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఇక పది వారాల తర్వాత వాటి సంఖ్య 50 శాతం పడిపోయే అవకాశాలు ఉన్నట్లు ద లాన్సెట్ జర్నల్ తన పత్రికలో ప్రచురించింది. బ్రిటన్‌కు చెందిన యూనివర్సిటీ కాలేజ్ లండన్(యూసీఎల్) పరిశోధకులు ఈ విషయాన్ని తెలిపారు. ఒకవేళ ఇలాగే యాంటీబాడీల సంఖ్య తగ్గుతూపోతుంటే, అప్పుడు కొత్త వేరియంట్లతో ప్రమాదం ఏర్పడే అవకాశాల ఉన్నట్లు పరిశోధకులు తెలిపారు. ఆస్ట్రాజెనికా టీకాలను కోవీషీల్డ్ పేరుతో ఇండియాలో పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. రెండు డోసుల కోవీషీల్డ్ కన్నా.. రెండు డోసుల ఫైజర్ చాలా మేలు అని లండన్ వర్సిటీ పరిశోధకులు చెప్పారు. అయితే వ్యాక్సిన్లు తీసుకున్నవారిలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు అంచనా వేశారు. ఆస్ట్రా, ఫైజర్ రెండు డోసుల టీకాల వల్ల మొదట్లో అధిక స్థాయిలో యాంటీబాడీలు ఉన్నాయని, వాటి వల్లే ఇన్‌ఫెక్షన్ తగ్గినట్లు గుర్తించామన్నారు. కానీ రెండు లేదా మూడు నెలల్లో రోగనిరోధక శక్తి కణాల సంఖ్య తగ్గుతున్నట్లు మధుమిత్రా సోత్రి తెలిపారు. 18 ఏళ్లు దాటిన 600 మందిపై చేపట్టిన సర్వే ఆధారంగా ఈ విషయాన్ని తేల్చారు. ఫైజర్ తీసుకున్నవారిలో 21 నుంచి 41 రోజుల మధ్య 7506 యూనిట్లుగా ఉన్న యాంటీబాడీలు.. 70 రోజులు దాటిన తర్వాత ఆ సంఖ్య 3320 U/mL కు పడిపోయినట్లు గుర్తించారు. ఇక ఆస్ట్రాజెనికా టీకా వేసుకున్నవారిలోనూ.. 20 రోజుల వరకు 1201U/mLగా ఉన్న యాంటీబాడీల సంఖ్య 70 రోజుల తర్వాత అయిదు రేట్లు తగ్గినట్లు గుర్తించారు. ఆస్ట్రాజెనికా టీకా తీసుకున్నవారిలో యాంటీబాడీల సంఖ్య తక్కువగా ఉందని, వారికి మొదటగా బూస్టర్ డోసులు ఇవ్వాలని సూచించినట్లు ప్రొఫెసర్ రాబ్ ఆల్డ్రిజ్ తెలిపారు.