YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

మిర్చి..భలే హాట్ గురూ...

మిర్చి..భలే హాట్ గురూ...

గుంటూరు, జూలై 28, 
గుంటూరు నుంచి వివిధ దేశాలకు మిర్చి ఎగుమతులు మళ్లీ నిలిచాయి. ఏటా చైనా, బంగ్లాదేశ్‌, శ్రీలంక, సింగపూర్‌, థారులాండ్‌, స్విజ్జర్లాండ్‌ తదితర దేశాలకు రెండు నుంచి రెండున్నర లక్షల క్వింటాళ్ల వరకు మిర్చి ఎగుమతి అయ్యేది. కరోనా నేపథ్యంలో రెండేళ్లుగా చైనాతో పాటు పలు దేశాలకు ఎగుమతులు ఆశాజనకంగా లేవు. గతేడాది లాక్‌డౌన్‌ తర్వాత తిరిగి కొన్ని నెలల పాటు ఎగుమతులు పునర్‌ ప్రారంభమయ్యాయి. కరోనా మొదటి దశ ప్రభావం తగ్గిన తర్వాత మూడు నెలలపాటు ఎగుమతులు జరిగాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో కేవలం లక్షన్నర క్వింటాళ్లే ఎగుమతి అయ్యాయి. కరోనా రెండో దశతో ఎగుమతులు మళ్లీ నిలిచాయి. ప్రస్తుతం వివిధ దేశాల్లో కరోనా మూడో దశ ప్రభావంతో లాక్‌డౌన్‌, రవాణాపై ఆంక్షలు తదితర కారణాలతో నాలుగు నెలలుగా ఎగుమతులు లేవు. పాకిస్తాన్‌, చైనాలో మిర్చి ఉత్పత్తులు బాగా పెరిగి వారు భారత్‌ నుంచి దిగుమతులు గణనీయంగా తగ్గించారని గుంటూరులో మిర్చి వ్యాపారి పులగం సురేష్‌రెడ్డి తెలిపారు.ఈ ఏడాది వివిధ దేశాలకు ఎగుమతులు లేకున్నా దేశీయ అవసరాలకే ఎక్కువగా వివిధ రాష్ట్రాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. కారం, మసాలా కారం, అయిల్‌ తయారీ, ఇతర అనుబంధ ఉత్పత్తుల తయారీ కోసం ఇతర రాష్ట్రాల నుంచి ఆర్డర్లు భారీగా రావడం వల్ల గతేడాది నుంచి ధరలు తగ్గకుండా రైతులకు మద్దతు ధర లభిస్తోంది. తేజ, బాడిగ రకాలు ఇప్పటి వరకు క్వింటాలుకు రూ.14 వేల నుంచి రూ.16 వేల వరకు సగటు ధరలు లభించాయి. మిగిలిన రకాలకు క్వింటాలుకు రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు ధరలు స్థిరంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్ల్రాల్లో గుంటూరు, వరంగల్‌, ఖమ్మం నుంచి ఎక్కువగా ఎగుమతులవుతాయని వ్యాపారులు తెలిపారు. గుంటూరు మార్కెట్‌ ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్‌గా అభివృద్ది చెందింది. మిర్చికి పెట్టుబడులు భారీగా పెరిగినా ఉత్పత్తులు, ధరలు ఆశాజనకంగా ఉండటంతో రైతులు ఈ పంటపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.వివిధ దేశాలకు ఎగుమతులు తగ్గినా దేశీయంగా రాష్ట్రంలో పండిన మిర్చికి డిమాండ్‌ ఉందని మిర్చి యార్డు చైర్మన్‌ చంద్రగిరి ఏసురత్నం తెలిపారు. ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో కోల్డ్‌ స్టోరేజీల్లో 60 లక్షల టిక్కీల నిల్వలున్నాయని, ప్రస్తుతం యార్డుకు రైతులు తక్కువ సంఖ్యలో వస్తున్నారని, కోల్డ్‌ స్టోరేజీల్లోని సరుకే యార్డుకు వస్తోందని చెప్పారు. గుంటూరు మిర్చి యార్డులో ఏటా రూ.6 వేల కోట్ల టర్నోవర్‌ యథాతథంగా జరుగుతోందని తెలిపారు. గుంటూరు నుంచి వివిధ చిల్లీస్‌ పౌడర్‌లకు దేశ వ్యాప్తంగా మంచి డిమాండ్‌ ఉందని చెప్పారు.

Related Posts