YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సచివాలయాలకు భవనాలు కొరత

సచివాలయాలకు భవనాలు కొరత

నెల్లూరు, జూలై 28, 
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా గ్రామ/వార్డు సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు చేసి రెండేళ్లవుతున్నా... నేటికీ ఆయా సచివాలయాలకు శాశ్వత భవనాల్లేవు. సంక్షేమ పథకాలతోపాటు అభివృద్ధిలో కీలకంగా వ్యవహరిస్తున్న గ్రామ/వార్డు సచివాలయాల్లో అత్యధిక శాతం ఇతర శాఖలకు చెందిన ప్రభుత్వ భవనాల్లో సర్దుబాటు చేసుకుంటూ పాలన సాగిస్తున్న పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లో సచివాలయాల నిర్మాణాలకు ఉపాధి హామీ నిధులు ఉపయోగిస్తుండటంతో కొంతమేరకు భవన నిర్మాణాలు జరిగాయి. అయితే పట్టణ, నగర ప్రాంతాల్లో ఉపాధి హామీ నిధులు వాడుకునే సౌలభ్యం ఉండకపోవడం, స్థలాల సమస్య గ్రామ, వార్డు సచివాలయాల శాఖను వేధిస్తోంది. దీంతో పట్ణణాల్లో నిర్మాణాల కంటే సర్దుబాటుకే ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. ఇప్పటి వరకూ 10,929 వార్డు సచివాలయ భవన నిర్మాణాలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఇందుకు రూ.4,180 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో 5,137 భవనాల్లో మాత్రమే పనులు పూర్తికాగా, స్లాబు దశలో 3,628, బేస్‌మెంటు లెవెల్‌లో 456 భవన నిర్మాణాలు ఉన్నాయి. వీటితోపాటు మరో 1,708 భవనాలు పునాది దశకు కూడా చేరుకోలేదు. అలాగే 13 జిల్లాల్లోని నగరాల్లో 3,800 వార్డు సచివాలయాలకు భవనాలు నిర్మించాల్సి ఉండగా, ఇప్పటి వరకు కేవలం 800 కంటే తక్కువ నిర్మించినట్లు అధికార వర్గాల నుంచి తెలిసింది. పట్టణాల్లో శాశ్వత భవనాల నిర్మాణానికి స్థల సమస్య ప్రధానం కాగా, ఆయా భవన నిర్మాణాలకు మున్సిపల్‌ కార్పొరేషన్లలో నిధుల లభ్యత తక్కువ కావడం కారణంగా పలువురు పేర్కొంటున్నారు. గ్రామ సచివాలయ భవన నిర్మాణాలతోపాటు కార్యాలయంలో సిబ్బందికి అవసరమైన కంపూటర్లు, ఫర్నీచర్‌, మౌలిక వసతుల కల్పనకు సుమారు రూ.35 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇతర శాఖల భవనాల్లో ప్రారంభించిన పలు సచివాలయాలు గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పనులు చేసేందుకు ఆటంకం కలిగినట్లు పలువురు ఉద్యోగులు పేర్కొంటున్నారు. సచివాలయ ఉద్యోగులకు ఆగస్టులో ప్రొబేషనరీ పీరియడ్‌ డిక్లేర్‌ చేయనున్న తరుణంలోనైనా గ్రామ/వార్డు సచివాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.

Related Posts