ముంబై, జూలై 28,
డిజిటల్ కరెన్సీకి మారడానికి ఇదే సరైన టైమ్ అని భావిస్తున్నాయి చాలా దేశాలు. క్రిప్టో కరెన్సీలకు ఆదరణ పెరుగుతుండడంతో తమ డిజిటల్ కరెన్సీ ప్లాన్‌లను వేగవంతం చేస్తున్నాయి. చైనా ఈ–ఆర్‌ఎంబీ (డిజిటల్ యువాన్)ను ఇప్పటికే తెచ్చింది. సింగపూర్, సౌత్ కొరియా, హాంకాంగ్ దేశాలు కూడా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) లను పైలెట్ మోడ్‌లో లాంచ్ చేశాయి. జపాన్, ఆస్ట్రేలియా, యూఎస్ వంటి దేశాలు తమ కరెన్సీలను డిజిటల్ మోడ్‌లో తీసుకురావాలని ప్లాన్స్ వేస్తున్నాయి. ఇదే బాటలో ఇండియా కూడా అడుగులేస్తోంది. డిజిటల్ కరెన్సీని తీసుకురావడంలో ఇండియా ఇప్పటికీ ఆలోచన స్టేజ్‌లోనే ఉంది. కానీ, మరికొన్నేళ్లలో సొంతంగా డిజిటల్ రూపాయిని తీసుకొచ్చి బిట్‌కాయిన్, డోజ్‌కాయిన్, ఎథరమ్ వంటి ప్రైవేట్ క్రిప్టో కరెన్సీలకు పోటీగా ఉంచాలని ప్లాన్స్ వేస్తోంది. క్రిప్టో కరెన్సీలు సెంట్రల్ బ్యాంక్‌ల కంట్రోల్‌లో ఉండవు. డీసెంట్రలైజ్డ్‌గా ఉంటాయి కాబట్టి వీటిని అదుపులో ఉంచలేము. క్రిప్టోల వలన ఫైనాన్షియల్ సిస్టమ్ దెబ్బతింటుందని భావించి చైనా వంటి దేశాలు తమ సొంత వర్చువల్ కరెన్సీని తీసుకొస్తున్నాయి. ఇండియా కూడా డిజిటల్ రూపాయిని తెస్తామని ఇప్పటికే ప్రకటించింది. రిజర్వ్ బ్యాంక్ దీనిపై పనిచేస్తోంది కూడా. డిజిటల్ కరెన్సీని దశల వారీగా తీసుకొస్తామని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ టీ రవి శంకర్ తాజాగా ప్రకటించారు. ఇతర దేశాల్లో డిజిటల్ కరెన్సీ వాడకాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) ను తీసుకొచ్చేందుకు ఆర్‌బీఐ పనిచేస్తోందని అన్నారు. ప్రభుత్వం కూడా డిజిటల్ రూపాయిపై బిల్లు తేవాలని ప్లాన్స్ వేస్తోంది. డిజిటల్ కరెన్సీ వలన నోట్లను ముద్రించే ఖర్చు తగ్గుతుందని ఆర్‌బీఐ చెబుతోంది. అంతేకాకుండా, క్రిప్టో కరెన్సీలను ఎదుర్కోవడానికి సెంట్రల్ బ్యాంకులు ఇష్యూ చేసే డిజిటల్ కరెన్సీలు ముఖ్యమని ఆర్‌బీఐ భావిస్తోంది. ‘ బిట్‌కాయిన్, డోజ్‌కాయిన్, ఎథరమ్ వంటి ప్రైవేట్ వర్చువల్ కరెన్సీలకు తీసిపోకుండా మన సొంత డిజిటల్ కరెన్సీని డెవలప్ చేస్తాం. సీబీడీసీని తీసుకురావడం వలన మన రూపాయిపై ప్రజల్లో ఆసక్తి తగ్గదు. అంతేకాకుండా క్రిప్టో కరెన్సీలలో ఉండే వొలటాలిటీ డిజిటల్ రూపాయిలో ఉండదు’ అని టీ రవి శంకర్ అన్నారు. త్వరలో రిటైల్, హోల్‌సేల్ సెగ్మెంట్‌లో సీబీడీసీ పైలెట్ టెస్టింగ్‌ను చేపడతామని పేర్కొన్నారు. ప్రతీ ఐడియా అమల్లోకి రావడానికి కొంత టైమ్ పడుతుందని, సీబీడీసీ తీసుకురావడానికి ఆ టైమ్ వచ్చిందని పేర్కొన్నారు. ‘డిజిటల్ రూపాయిని తెస్తే బ్యాంక్‌లపై కొంత నెగెటివ్ ప్రభావం పడుతుంది. సీబీడీసీ వలన ప్రజలు డిపాజిట్ చేసుకోవడం తగ్గొచ్చు. కానీ, బ్యాంకులు వడ్డీ చెల్లించాల్సిన అవసరం కూడా ఉండదు. కాబట్టి బ్యాంకులపై డిజిటల్ రూపాయి ప్రభావం తక్కువగా ఉంటుంది. అందుకే డిజిటల్ రూపాయిని డిమాండ్ క్రియేట్ అయ్యేలా, బ్యాంకులూ లాభపడేలా డిజైన్ చేయాల్సి ఉంటుంది’ అని పేర్కొన్నారు. రిటైల్ పేమెంట్స్ కోసం లేదా హోల్‌సేల్ పేమెంట్స్ కోసం తీసుకురావాలని ఆర్‌బీఐ చూస్తోందని రవి అన్నారు. టోకెన్ మోడల్ లేదా లెడ్జర్ కింద తీసుకురావాలా? అని ఆలోచిస్తున్నామని చెప్పారు.
చైనానే ముందు..
చైనీస్ గవర్నమెంట్ 2016 లో ఎలక్ట్రానిక్ డిజిటల్ కరెన్సీని తీసుకొచ్చింది. మొత్తం నాలుగు సిటీలు షెంజెన్, సుజౌ, చెంగ్డూ, జియాంగ్‌లలో ఎలక్ట్రానిక్ యువాన్‌ను పైలెట్‌ప్రాజెక్ట్‌గా లాంచ్ చేసింది. బీజింగ్‌లో కూడా ఈ కరెన్సీని టెస్ట్ చేస్తోంది. అక్కడ మెక్‌డొనాల్డ్స్, స్టార్‌బక్స్ వంటి కంపెనీలు ఈ–యువాన్ కరెన్సీని తీసుకుంటున్నాయి. చైనాలో ఈ–యువాన్ వాడకాన్ని పెంచేందుకు ప్రభుత్వమే ‘రెడ్ ప్యాకెట్స్’ పేరుతో కొంత మందిని సెలెక్ట్ చేసి, వారికి గిఫ్ట్‌గా ఇస్తోంది. డిజిటల్ యువాన్‌ను అంగీకరించే షాపుల్లో ఈ గిఫ్ట్ ప్యాకెట్లను వాడుకోవచ్చు.
సింగపూర్‌లో మూడు దశలు పూర్తి..
మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ (ఎంఏఎస్) 2016 లో ‘యుబిన్’ ప్రాజెక్ట్‌ను తీసుకొచ్చింది. ఈ బ్లాక్ చెయిన్ టెక్నాలజీపై ఐదు దశల్లో ఎక్స్‌పెరిమెంట్స్ చేయాలని చూస్తోంది. మొదటి మూడు దశల్లో యుబిన్ ప్రాజెక్ట్ కింద కరెన్సీ క్లియరింగ్‌ను, సెటిల్‌మెంట్‌ను, పేమెంట్స్ డెలివరీ వంటి అంశాలపై టెస్ట్ చేశారు. ప్రస్తుతం యాక్సెంచర్, ఆర్3, ఐబీఎం, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలతో కలిసి ఎంఏఎస్ పనిచేస్తోంది.
ఈ ఏడాది స్టార్ట్ చేసిన సౌత్ కొరియా..
సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని తేవడంపై సౌత్ కొరియా ఇప్పటి వరకు వేచి చూసే ధోరణిని అనుసరించింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కొరియా (బీఓకే) ఈ ఏడాది ఏప్రిల్‌లో సీబీడీసీపై 22 నెలల పైలెట్ ప్రాజెక్ట్‌ను చేపట్టింది. 2022 నాటికి ఫైనాన్షియల్ సిస్టమ్‌లో సీబీడీసీ ప్రభావాన్ని అంచనావేయాలని టార్గెట్‌గా పెట్టుకుంది.
యూరప్‌లో డిజిటల్ యూరో..
డిజిటల్ యూరోని కమర్షియల్‌గా తీసుకురావడంపై యురోపియన్ సెంట్రల్ బ్యాంక్ పనిచేస్తోంది. రిటైల్ సెగ్మెంట్‌లో సీబీడీసీ విస్తరించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఈ సెంట్రల్ బ్యాంక్ అంచనావేస్తోంది. యూరో కరెన్సీ స్టెబిలిటీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా డిజిటల్ యూరో పనిచేస్తుందని నమ్మకం వచ్చాక, డిజిటల్ యూరోని కమర్షియల్‌గా లాంచ్ చేస్తామని ప్రకటించింది. ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ కెనడా, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్, బ్యాంక్ ఆఫ్ జపాన్, స్విస్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్‌మెంట్స్ (బీఐఎస్) తో కలిసి ఈ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ సామర్ధ్యాన్ని పెంచడంపై పనిచేస్తోంది. ఫ్రాన్స్, నెదర్లాండ్‌లలో డిజిటల్ కరెన్సీని మొదట టెస్టింగ్ చేయనుంది.
డెన్మార్క్‌లో ఈ–క్రోన్ ప్రాజెక్ట్ క్యాన్షిల్...
2016 లోనే డిజిటల్ కరెన్సీ డానిష్ క్రోన్‌ను తీసుకొచ్చింది. కానీ, ఈ–క్రోన్‌ను తీసుకురావడం వలన పెద్దగా లాభమేమి లేదని 2017 లో నిర్ణయించుకుంది. ప్రస్తుతానికి డిజిటల్ కరెన్సీపై తన ప్లాన్స్‌ను క్యాన్సిల్ చేసుకుంది. ఫ్యూచర్‌లో మళ్లీ తీసుకురావొచ్చు. కొన్ని దేశాలు తమ సొంత కరెన్సీని డిజిటల్‌గా తేవడం కంటే, ఇప్పటికే వాడుకలో ఉన్న బిట్‌కాయిన్‌ను తమ డిజిటల్ కరెన్సీగా మార్చుకోవాలని చూస్తున్నాయి. ఎల్ సాల్వడర్ ఇప్పటికే బిట్‌కాయిన్‌ను లీగల్ కరెన్సీగా ప్రకటించింది. పరాగ్వే కూడా అదే బాటలో ఉంది. బిట్‌కాయిన్, డోజ్‌కాయిన్, ఎథరమ్ వంటి క్రిప్టో కరెన్సీలు కూడా డిజిటల్ కరెన్సీలే. కానీ, వీటిని కంట్రోల్ చేయడానికి దేశాల సెంట్రల్ బ్యాంకులకు వీలుండదు. అందుకే సొంతంగా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీల (సీబీడీసీ) ను తీసుకురావాలని వివిధ దేశాలు చూస్తున్నాయి.