హైద్రాబాద్, జూలై 28,
హైద్రాబాద్ నగరంలోని అనేక ప్రాంతాల్లో ప్రైవేట్ స్కూళ్లు ప్రస్తుతం ఆన్‌లైన్ క్లాస్‌లను నిర్వహిస్తున్నాయి. కొన్ని స్కూళ్లలో ఒకటో తరగతి నుంచే ఈ బోధన కొనసాగుతుండగా మరికొన్ని స్కూళ్లు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆన్‌లైన్ తరగతులను నిర్వహిస్తున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా నెలకొన్న పరిస్థితులతో పిల్లల చదువులే కాకుండా విద్యాసంస్థల మనుగడ కూడా ఇప్పుడు ఆన్‌లైన్‌పై ఆధారపడి ఉండడం గమనార్హం. ఈ నేపథ్యంలో నిర్వహిస్తున్న కంప్యూటర్ పాఠాలు పిల్లలపై ఒత్తిడిని తీవ్రతరం చేస్తున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బోధనా పద్ధతిలో మార్పు అవసరమని సూచిస్తున్నారు. క్లాస్ రూమ్ తరహాకు భిన్నంగా ఇష్టాగోష్టి పద్ధతిలో ఆన్‌లైన్ విద్యాబోధన ఉండాలని అభిప్రాయడుతున్నారు. ఆన్‌లైన్ క్లాసులతో పిల్లలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కంప్యూటర్‌కు అతుక్కుపోతున్నారు. కొంతమంది మొబైల్ ఫోన్‌లలో క్లాసులకు హాజరవుతున్నారు. దీంతో కేవలం ఒక డివైజ్‌పై దృష్టి సారించి గంటల తరబడి కూర్చోవడం వల్ల పిల్లల సృజనాత్మకత దెబ్బతింటుంది. చాలా మంది పిల్లలు కళ్లు పొడిబారడం, తలనొప్పి, వెన్నెముక నొప్పి వంటి శారీరక ఇబ్బందులకు గురవుతున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. మెదడు తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంది. కొత్త విషయాలను నేర్చుకొనే సామర్థ్యం దెబ్బతింటుంది. చాలా మంది పిల్లలు కంప్యూటర్ ముందు కూర్చున్నప్పటికీ టీచర్లు చెప్పే పాఠాలను అర్థం చేసుకోలేకపోతున్నారు. ఏకాగ్రత లోపిస్తుందని మానసిక వైద్యులు అభిప్రాయపడుతున్నారు. విశాలమైన తరగతి గదిలో తోటి విద్యార్థులతో కలిసి చదువుకొనే వాతావరణానికి భిన్నంగా నట్టింట్లో కంఫ్యూటర్, మొబైల్ ఫోన్, ట్యాప్ లాంటివి ముందేసుకొని టీచర్లు చెప్పే పాఠాలను వినడం, నేర్చుకోవడం పిల్లలకు ‘శిక్ష’గానే ఉంటుంది. కానీ కోవిడ్ కారణంగా అనివార్యంగా మారిన ఈ విద్యాబోధనను ‘చక్కటి శిక్షణ’గా మార్చేందుకు పిల్లల భాగస్వామ్యాన్ని పెంచడం తప్పనిసరి. ఇందుకోసం ‘టీచర్ పాఠం చెబుతుంటే పిల్లలు వినడం’ అనే పద్ధతికి భిన్నంగా ఏదైనా ఒక అంశంపై వీడియో పాఠాలను చూపించి ఆ తర్వాత దానిపై పిల్లలతో చర్చ నిర్వహిస్తే ఎక్కువగా నేర్చుకొంటారని, పిల్లల భాగస్వామ్యం పెరుగుతుందని పేర్కొంటున్నారు.