YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

భారీగా టేకు ఆదాయం

 భారీగా టేకు ఆదాయం

అదిలాబాద్, జూలై 28, 
హరితహారంలో భాగంగా టేకు మొక్కలను రాష్ట్ర సర్కారు పంపిణీ చేస్తున్నది. ఇప్పటివరకు ఆరు విడుతలుగా అందజేసిన మొక్కలు ఏపుగా పెరిగాయి. ఖాళీ స్థలాలు, పొలం గట్ల వెంట పెంచేందుకు సర్కారు రైతులను ప్రోత్సహిస్తున్నది. మొక్కల పెంపకానికి ఎలాంటి ఖర్చు లేక పోవడం, పంటలకు వేసిన ఎరువులే వాటికి ఉపయోగపడడంతో రైతులు ఆసక్తి చూపుతున్నారు. మొక్కలను సంరక్షించిన రైతులకు ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ద్వారా ఖర్చు కింద డబ్బులు చెల్లిస్తున్నది. ఎకరానికి బ్లాక్‌ ప్లాంటేషన్‌(ఒకే చోట దగ్గర దగ్గరగా) కింద 800, ఎకరానికి బండ్‌ ప్లాంటేషన్‌(పొలాల గట్లపై) 120 మొక్కలను పెంచుకోవచ్చు. అలాగే పొలం గట్లపై కూడా పెంచడం ద్వారా ఎలాంటి నష్టం లేదని, అదనంగా ఆదాయం సంపాదించుకోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు.తెలంగాణ ప్రభుత్వం సామాజిక వనాల అభివృద్ధి కోసం ప్రతి గ్రామంలో నర్సరీలను ఏర్పాటు చేసింది. వీటిలో టేకుతోపాటు ఇతర మొక్కలను పెంచుతున్నారు. టేకు మొక్కలను తీసుకెళ్లి నాటి, పెంచి, సంరక్షణకు అయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరిస్తున్నది. గుంత తీసేందుకు ప్రతి మొక్కకు రూ.26, నాటేందుకు రూ.16, రెండేళ్ల వరకు ఎరువులు, నీటి తడులు, కలుపు, ఇతర నిర్వహణ ఖర్చులను ప్రభుత్వమే అందిస్తున్నది. గట్లపై మొక్కలు పెంచుతూ అంతర పంటలు కూడా సాగు చేసుకొని ఆర్థికంగా ఎదిగే అవకాశం ఉంది.టేకు మొక్కల పెంపకంతో రైతులకు మంచి ఆదాయం లభిస్తున్నది. 12 ఏండ్లకు అవి 10 అడుగులు పెరుగుతాయి. ఆ తర్వాత మూడేండ్లకు కలప చేతికి వస్తుంది. అప్పుడు టేకును మార్కెట్‌కు తరలించి విక్రయిస్తే మంచి ఆదాయం సమకూరుతుంది. ఇతర పంటలతో పోల్చితే టేకుతో అధిక లాభాలు గడించవచ్చు. టేకు చెట్లకు ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వర్షాలు పడినప్పుడు మట్టి కొట్టుకుపోకుండా ఆకులు అడ్డుగా ఉంటాయి. ఆకులు కిందికి రాలడం ద్వారా కొద్ది రోజులకు ఆ ఆకులు కుళ్లిపోయి అవి ఎరువులుగా ఉపయోగపడుతాయి.టేకు మొక్క ఎదిగిన తర్వాత కలపను విక్రయించేందుకు అనుమతులు పొందవచ్చు. కలప విక్రయించే రైతులు స్థానిక అటవీ శాఖ అధికారికి దరఖాస్తు చేసుకోవాలి. వెంటనే చెట్ల సంఖ్య, చెట్లు పట్టా భూమిలో ఉన్నాయా? ప్రభుత్వ భూమిలో ఉన్నాయా? అని పరిశీలిస్తారు. అన్ని సక్రమంగా ఉంటే మార్కెట్‌లో విక్రయించేందుకు అనుమతిస్తారని దస్తురాబాద్‌ ఏపీవో రవి ప్రసాద్‌ తెలిపారు.

Related Posts