అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్తున్నప్పటికి విదేశాల నుంచి అడ్డదారుల్లో అక్రమార్కులు బంగారాన్ని దేశంలోకి తరలించడం కొనసాగుతూనే ఉంది. ఓ వ్యక్తి విమానంలోని సీటు కింది భాగంలో రంధ్రం చేసి 799 గ్రాముల బంగారం బిస్కెట్లను దాచిపెట్టిన ఘటన నిన్న శంషాబాద్ విమానాశ్రయంలో వెలుగులోకి రాగా.. గురువారం దిల్లీలో ఏకంగా రూ.3కోట్ల విలువైన బంగారం బిస్కెట్లు మరుగుదొడ్డిలో లభ్యమయ్యాయి. దిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్- 3లోని మరుగుదొడ్డిలో రూ.3కోట్ల విలువచేసే తొమ్మిది బంగారం కడ్డీలను గుర్తించినట్టు సీఐఎస్‌ఎఫ్ అధికారులు గురువారం మీడియాకు వెల్లడించారు. ఒక్కో కడ్డీ బరువు కిలో ఉంటుందని, వాటిని కస్టమ్స్‌అధికారులకు అప్పగించినట్టు తెలిపారు. నిన్న రాత్రి విధుల్లో ఉన్న సిబ్బంది మరుగుదొడ్డిలో ఓ ల్యాప్‌టాప్ బ్యాగును గుర్తించి మిగతావారిని అప్రమత్తం చేశారని, దీంతో అక్కడికి చేరుకున్నవారు దాన్ని తెరచి చూడగా అందులో తొమ్మిది బంగారు కడ్డీలు ఉన్నట్టు గుర్తించినట్టు అధికారులు వివరించారు. గుర్తుతెలియని వ్యక్తి వీటిని తీసుకొచ్చాడని, విమానాశ్రయంలో భద్రతాపరమైన సమస్యలతో ఆ బ్యాగును మరుగుదొడ్డిలో ఉంచి వెళ్లిపోయి ఉంటాడని భావిస్తున్నారు. ఆగంతకుడి ఆచూకీ కోసం విమానాశ్రయంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్టు చెప్పారు.