హైదరాబాద్ జూలై 28
తెలంగాణ పాలిసెట్-2021 ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణ మండలి కన్వీనర్ శ్రీనాథ్ బుధవారం విడుదల చేశారు. ఎంపీసీ విభాగంలో 81.75 శాతం ఉత్తీర్ణత, బైపీసీ విభాగంలో 76.42శాతం ఉత్తీర్ణత నమోదైందని కన్వీనర్ పేర్కొన్నారు. ఈ నెల 17న పరీక్ష జరగ్గా.. 1,02,496 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 411 కేంద్రాల్లో జరిగిన పరీక్షకు ఈ సంవత్సరం 92,557 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాల నేపథ్యంలో మంగళవారమే కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను సాంకేతిక విద్యాశాఖ ప్రకటించింది. ఆగస్టు 5వ తేదీ నుంచి పాలిసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. 5 నుంచి 9 వరకు రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్, 6వ నుంచి 10 వరకు సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కొనసాగనుంది. 6వ నుంచి 12 వరకు వెబ్ ఆప్షన్స్ కేటాయింపు, 14న మొదటి విడత సీట్ల కేటాయింపు.. 23 నుంచి తుది విడుత కౌన్సెలింగ్ జరుగనుంది. 24న తుది విడుత ధ్రువీకరణపత్రాలను పరిశీలించనున్నారు. 24, 25 తేదీల్లో తుది విడత వెబ్ ఆప్షన్లకు అవకాశం, 27న తుది విడత సీట్ల కేటాయింపు జరుగనుంది. సెప్టెంబర్ 1 నుంచి పాలిటెక్నిక్ విద్యా సంవత్సరం ప్రారంభం కానుండగా.. సెప్టెంబర్ 9న స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలు విడుదలచేయనున్నారు. విద్యార్థులు https://polycetts.nic.in, sbtet.telangana.gov.in, dtets.cgg.gov.inలో ఫలితాలు చూసుకోవచ్చని చెప్పారు.