YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

హైదరాబాద్‌లో భారీ వర్షానికి ముగ్గురి మృతి

 హైదరాబాద్‌లో భారీ వర్షానికి ముగ్గురి మృతి

హైదరాబాద్‌ జంటనగరాల్లోని పలు చోట్ల ఈ మధ్యాహ్నం కురిసిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపుతో పెద్ద శబ్ధాలు రావడంతో భయాందోళనలకు గురయ్యారు. ఆరాంఘర్‌లో వర్షానికి ప్రహరీగోడ పక్కన నిలబడిన వారిపై గోడకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గరు మృతిచెందారుదట్టమైన మేఘాలు కమ్ముకోవడంతో పట్టపగలే చీకటిమయంగా మారింది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తుండగా.. ఈదురు గాలులతో కూడిన వర్షానికి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. అశోక్‌నగర్‌, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌, నాంపల్లి, అబిడ్స్‌, కోఠి, ఖైరతాబాద్‌, బషీర్‌బాగ్‌, బహుదూర్‌పురా, యాకుత్‌పురా, చార్మినార్‌, చాంద్రాయణగుట్ట, సైదాబాద్‌, ముషీరాబాద్‌, మల్కాజ్‌గిరి, కుషాయిగూడ, ఈసీఐఎల్‌, ఓయూ, తార్నాక తదితర ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. . అకాల వర్షాల నేపథ్యంలో హైదరాబాద్‌లోని వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది. భానుడి భగభగలకు అల్లాడుతున్న తమకు ఈ వర్షం కొంత ఉపశమనం కల్గించిందని ప్రజలు ఆనందం వ్యక్తంచేస్తున్నప్పటికీ... ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసింది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. రాజధాని నగరంలో ప్రజలకు ఎలాంటి ఆటంకం లేకుండా ఉండేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తోంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈదురు గాలుల బీభత్సానికి నెక్లెస్‌ రోడ్డుపై చెట్టు విరిగిపడింది. దీంతో కారు, ఆటో, రెండు ద్విచక్రవాహనాలు ధ్వసంమయ్యాయి. ఎన్టీఆర్‌ మార్గ్‌లోనూ చెట్లు కూలాయి. మరోచోట బస్‌ షల్టర్‌ ఒరిగిపోయింది. విరిగిపడిన చెట్లను జీహెచ్‌ఎంసీ సిబ్బంది, ట్రాఫిక్‌ పోలీసులు తొలగిస్తున్నారు. అలాగే జీహెచ్‌ఎంసీ కార్యాలయం వద్ద మోకాలి లోతు నీరు చేరింది.

Related Posts