హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలకు ఆకస్మికంగా వరదలు
ఎనిమిది మృతి ..మరో ఎనిమిది గల్లంతు
రెడ్ అలెర్ట్ జారీ చేసిన షిమ్లా వాతావరణ కేంద్రం
షిమ్లా జూలై 28
హిమాచల్‌ప్రదేశ్‌లో భారీ వర్షాలకు ఆకస్మికంగా వరదలు పోటెత్తాయి. వరదల్లో చిక్కుకొని ఎనిమిది మృతి చెందగా.. మరో ఎనిమిది గల్లంతయ్యారు. కులు జిల్లాలో నలుగురు, లాహౌల్ – స్పితి జిల్లాలో ముగ్గురు, చంబా జిల్లాలో ఒకరు మృతి చెందారని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ డైరెక్టర్ సుదేష్ కుమార్ మోక్త తెలిపారు. వర్షంతో లాహౌల్‌కు వెళ్లే రహదారులపై కొండచరియలు విరిగిపడ్డాయి. కులు జిల్లాలో 26 ఏళ్ల పూనమ్ అనే మహిళ, ఆమె నాలుగేళ్ల కుమారుడు ఉదయం పార్వతి నదికి ఉపనది అయిన బ్రహంగంగ నదిలో కొట్టుకుపోయారు. నదిలో ఒక్కసారిగా నీటిమట్టం పెరగడంతో.. వరదల్లో మరో ఇద్దరు కొట్టుకుపోయారు. లాహౌల్‌లోని ఉదయపూర్‌లో మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో వచ్చిన వరదలకు ఇద్దరు కార్మికులతో పాటు ఓ ప్రైవేటు జేసీబీ కొట్టుకుపోయింది. ఇద్దరు కూలీలు మృతి చెందగా.. మరో కొందరు కూలీల ఆచూకీ దొరకలేదు. వారిని వెతికేందుకు పోలీసులతో పాటు, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) బృందాలను పంపారు. నీటి ఉధృతి కారణంగా మంగళవారం రాత్రి సెర్చ్ ఆపరేషన్‌కు ఆటంకం కలిగిందని సుదేష్ మోక్త తెలిపారు. బుధవారం ఉదయం రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించగా.. కార్మికులను రక్షించేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను పంపాలని కోరినట్లు లాహోల్-స్పితి డిప్యూటీ కమిషనర్ నీరజ్ కుమార్ తెలిపారు. కొండచరియలు విరిగిపడడంతో 60 వాహనాలు చిక్కుకుపోయాయని, చాలా ప్రాంతాల్లో రోడ్లు తిన్నాయి. సిమ్లా నగరంలోని వికాస్ నగర్‌లో కొండచరియలు విరిగిపడి కారుపై పడ్డాయి. మరో వైపు షిమ్లా వాతావరణ కేంద్రం రెడ్ అలెర్ట్ జారీ చేసింది.