తెలుగు రాష్ట్రాల్లో వరుణుడు బీభత్సం సృష్టించాడు. ఈదురుగాలులుతో కూడిన వర్షంతో భారీ నష్టం వాటిల్లింది. ఆంధ్రప్రదేశ్‌లో అరటి, మామిడి పంటలకు నష్టం వాటిల్లింది. గాలుల బీభత్సానికి మామిడి నేలరాలింది. పలుచోట్ల రహదారులపై చెట్లు విరిగిపడిపోయాయి. వరదలతో రహదారులన్నీ జలమయమయ్యాయి. దీంతో పలుచోట్ల వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పలు పట్టణాలు, గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో 2 గంటలపాటు ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. విశాఖపట్నంలోనూ వర్షం పడింది. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం, నూజివీడు, తిరువూరు, పెడనలలోనూ భారీ వర్షం కురిసింది. పలు చోట్ల పిడుగులు పడ్డాయి. మచీలిపట్నం, పెడన, గుడూరు, చల్లపల్లి, గుడ్లవల్లేరు, పామర్రు, మైలవరం తదితర మండలాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.కృష్ణా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. ప్రజలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ఆ జిల్లాలోని గన్నవరంలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. మచిలీపట్నం, నూజివీడు, తిరువూరు, పెడనలో మోస్తరు వర్షం పడుతోంది. విజయవాడలో భారీవర్షంతో రహదారులు జలమయమయ్యాయి. రహదారులపై ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.కృష్ణా జిల్లాలో మరోసారి పిడుగులు పడే అవకాశం ఉందని సంబంధిత అధికారులు తెలిపారు. కృష్ణా జిల్లాలో నెలకొన్న పరిస్థితిపై జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం సమీక్ష జరిపి అధికారులను అప్రమత్తం చేసి, తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.