ఫీజు రీఎంబర్స్ మెంట్ తో విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం జగన్
- నిరుపేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలి
- రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
గుడివాడ, జూలై 28
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న విద్యాదీవెన పథకం (ఫీజు రీఎంబర్స్ మెంట్) ద్వారా సీఎం జగన్మోహనరెడ్డి పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) అన్నారు. బుధవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని పట్టణానికి చెందిన కొంకితల ఆంజనేయప్రసాద్ కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన కుమారుడు అజయ్ తెలంగాణా రాష్ట్రం బాచుపల్లిలోని గోకరాజు గంగరాజు ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ సీఎస్ఈ కోర్సును పూర్తి చేశాడని చెప్పారు. ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం వచ్చిందని, అయితే అజయ్ కు సంబంధించిన సర్టిఫికెట్లను ఇవ్వడానికి కళాశాల యాజమాన్యం నిరాకరిస్తోందన్నారు. బీటెక్ చదువుకు సంబంధించి ఫీజు రీఎంబర్స్ మెంట్ మంజూరైందని, అయితే కళాశాల యాజమాన్యం మాత్రం ఫీజు రీఎంబర్స్ మెంట్ తమ అకౌంట్ కు జమ కాలేదని చెబుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంజూరు చేసిన ఫీజు రీఎంబర్స్మెంట్ మొత్తం గోకరాజు గంగరాజు కళాశాలకు జమ అయ్యేలా చూడాలని కోరారు. దీనిపై మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ ఈ విషయాన్ని కళాశాల యాజమాన్యంతో మాట్లాడతానని, ఏవైనా సమస్యలు వస్తే సీఎం జగన్మోహనరెడ్డి దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరిస్తానని చెప్పారు. అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి విద్యార్థికీ సకాలంలో, ఎటువంటి బకాయిలు లేకుండా పూర్తి ఫీజు రీఎంబర్స్ మెంట్ చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. నిరుపేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలని ఫీజు రీఎంబర్స్ మెంట్ ను పూర్తిస్థాయిలో అమలు చేయడం జరుగుతోందన్నారు. ఫీజు రీఎంబర్స్ మెంట్ కోసం విద్యార్థులు ఎదురు చూడకూడదని, తల్లిదండ్రులు అప్పుల పాలు కాకూడదని సీఎం జగన్ పదేపదే చెబుతూ వస్తున్నారన్నారు. దీనిలో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్ నెల్లో తొలి విడతగా 10 లక్షల 88 వేల 439 మంది విద్యార్థులకు రూ. 671.45 కోట్లను నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో వేశామన్నారు. రెండవ విడత దాదాపు 10.97 లక్షల మంది విద్యార్థులకు రూ.693.81 కోట్లు జమ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందన్నారు. 2018-19 విద్యా సంవత్సరానికి చెల్లించాల్సిన గత ప్రభుత్వ హయాంలోనూ బకాయిలు రూ.1774.60 కోట్లను సీఎం జగన్ అధికారంలోకి రాగానే చెల్లించారన్నారు. ఫీజు రీఎంబర్స్మెంట్ ను కళాశాలలకు కాకుండా నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి ప్రభుత్వం జమ చేయడం వల్ల తల్లిదండ్రులు కళాశాలకు వెళ్ళి నేరుగా ఫీజులను చెల్లించడంతో పాటు విద్యాబోధన, సౌకర్యాలు, ఇతర వసతుల గురించి ఆరా తీసే అవకాశం ఉంటుందన్నారు. పరిష్కారం కాని సమస్యలు ఉంటే వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చన్నారు. ఫీజుల పేరుతో విద్యార్థుల నుండి అధిక మొత్తంలో కళాశాల యాజమాన్యాలు వసూలు చేయకుండా ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందన్నారు. కళాశాల యాజమాన్యాల్లోనూ జవాబుదారీతనం పెంచేలా ఫీజు రీఎంబర్స్ మెంట్ ను అమలు చేస్తున్నామని మంత్రి కొడాలి నాని తెలిపారు.