కర్ణాటక సీఎం కీలక నిర్ణయాలు
బెంగళూర్, జూలై 28,
కర్నాటక తదుపరి సీఎంగా బాధ్యతలు చేపట్టిన కొద్ది గంటలకే బసవరాజ్ బొమ్మై బుధవారం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రూ వేయి కోట్లతో రైతుల పిల్లల కోసం నూతన స్కాలర్‌షిప్ పధకం ప్రకటించారు. వితంతు పింఛన్‌ను రూ 600 నుంచి రూ 800కు, సంధ్యా సురక్ష పధకం కింద వృద్ధాప్య పింఛన్‌ను రూ 1000 నుంచి రూ 1200కు పెంచారు. పింఛన్ పెంపుతో 35.98 లక్షల మంది ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని సీఎం బొమ్మె వెల్లడించారు.ఈ నిర్ణయంతో ప్రభుత్వ ఖజానాపై రూ 863 కోట్ల అదనపు భారం పడుతుందని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఖర్చులను తగ్గించుకుని వనరులను పూర్తిగా వినియోగించుకుంటూ ప్రభుత్వం ఆర్ధిక క్రమశిక్షణతో ముందుకు సాగుతుందని ఆయన తెలిపారు. సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం తాను క్యాబినెట్ సహచరులతో అధికారులతో సమావేశమయ్యానని, వరదలు..కొవిడ్-19ను దీటుగా ఎదుర్కోవడం తమ ప్రభుత్వ ప్రధాన అజెండా అని స్పష్టం చేశానని బొమ్మై పేర్కొన్నారు.