రఘురామ విదేశాలకు పారిపోతారు : విజయసాయిరెడ్డి
న్యూఢిల్లీ, జూలై 28,
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే ఎంపీ రఘురామ, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మధ్య సంబంధంపై పరోక్ష కామెంట్స్ చేశారు. రఘురామ కృష్ణరాజుకు ఎంపీ పదవి పోయిన మరుక్షణమే విదేశాలకు పారిపోయేందుకు సిద్ధం అవుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు చేసిన ఫిర్యాదును ఉటంకిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఎంపీ రఘురామ కృష్ణరాజు, టీవీ 5 ఛానల్ చైర్మన్ బీఆర్ నాయుడు మధ్య పెద్ద ఎత్తున హవాలా లావాదేవీలు జరిగాయని వైసీపీ ఎంపీలు ప్రధాని నరేంద్ర మోదీకి 15 మంది ఎంపీల బృందం ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఎంపీ రఘురామ, బీఆర్ నాయుడు మధ్య పెద్ద ఎత్తున హవాలా లావాదేవీలు జరిగినట్లు విజయసాయిరెడ్డి నేతృత్వంలోని బృందం ఫిర్యాదులో పేర్కొంది. వారిద్దరి మధ్య మిలియన్ యూరోలు బదిలీ జరిగినట్లు ఆరోపించారు.ఈ క్రమంలో దేశం విడిచి పారిపోయే ఆలోచన లేనోడికి ‘మిలియన్ యూరోల’తో పనేంటి అంటూ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ఈ స్కెచ్ వేసిన బాబు సామాన్యుడా.. పోలీసుల కంటపడకుండా ఎంతో మంది ముద్దాయిల్ని దాచిపెట్టిన చరిత్ర తెలిసిందేగా అంటూ చంద్రబాబును సైతం టార్గెట్ చేశారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి బుధవారం ట్వీట్ చేశారు.పారిపోయే ఆలోచన లేనోడికి ‘మిలియన్ యూరోల’తో పనేంటి?. స్కెచ్ వేసిన బాబు సామాన్యుడా. పోలీసుల కంటపడకుండా ఎంతో మంది ముద్దాయిల్ని దాచిపెట్టిన చరిత్ర తెలిసిందేగా. కేంద్రాన్ని అప్రమత్తం చేస్తే అంత ఉలుకెందుకు. డిస్క్వాలిఫై అయిన మరుక్షణం ఎగిరిపోడానికి రెడీ అవుతున్నాడు.’’ అంటూ విజయసాయిరెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు