గవర్నర్ గిరీ వద్దు : యడ్డీ
బెంగళూర్, జూలై 28,
యడియూరప్ప రాజీనామాతో ఖాళీ అయిన కర్ణాటక ముఖ్యమంత్రి పీఠాన్ని బసవరాజ్ బొమ్మై నేడు అధిష్ఠించారు. సీఎం రేసులో అనేక మంది నేతలు పోటీ పడినా చివరికి బసవరాజ్‌నే అదృష్టం వరించింది. యడ్డీ సూచన మేరకు లింగాయత్ వర్గానికి చెందిన బసవరాజునే సీఎంగా బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసింది. అయితే ఇప్పుడు యడియూరప్ప భవిష్యత్ కార్యాచరణ ఏంటన్నది హాట్‌టాపిక్‌గా మారింది. అధిష్ఠానం సూచన మేరకు ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగిన యడియూరప్ప క్రియాశీలక రాజకీయాల్లోనే కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.ఆంధ్రప్రదేశ్‌కు గానీ పశ్చిమబెంగాల్‌కు గానీ గవర్నర్‌గా వెళ్లాలని బీజేపీ అధిష్ఠానం యడియూరప్పకు ఆఫర్ ఇచ్చినా ఆయన సున్నితంగానే తిరస్కరించినట్లు సమాచారం. తనకు ఏ రాష్ట్రానికీ గవర్నర్‌గా వెళ్లే ఆలోచన లేదని, తనపై ఒత్తిడి తీసుకురావద్దని ఆయన బీజేపీ పెద్దలకు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. గతంలో ప్రధాని అటల్ బిహారి వాజపేయి తనను కేంద్ర మంత్రివర్గంలో చేరాల్సిందిగా ఆహ్వానించినా తాను సున్నితంగానే తిరస్కరించానని సోమవారం రాజీనామా అనంతరం బెంగళూరులో ఆయన మీడియాకు చెప్పారు.దీంతో గవర్నర్ పదవి ఇవ్వజూపినా తాను అంగీకరించబోననే సంకేతాలను ఆయన పరోక్షంగా అధిష్ఠానం పెద్దలకు పంపినట్లయింది. అయితే యడియూరప్ప క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగాలని నిర్ణయించుకోవడం అధిష్ఠానం పెద్దలకు ఏమాత్రం మింగుడుపడటం లేదు. రాష్ట్ర రాజకీయాల్లో ఆయన కొనసాగితే నూతన ముఖ్యమంత్రికి తలనొప్పులు తప్పవని భావిస్తున్నారు. తన కొడుకు విజయేంద్రకు మంచి రాజకీయ భవిష్యత్తును అందించాలన్న కృతనిశ్చయంతోనే యడ్డీ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.