YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

షెడ్యూల్‌, నాన్‌ షెడ్యూల్‌ అంశం

షెడ్యూల్‌, నాన్‌ షెడ్యూల్‌ అంశం

విశాఖపట్టణం, జూలై 29, 
విశాఖ ఏజెన్సీలో షెడ్యూల్‌, నాన్‌ షెడ్యూల్‌ అంశం మళ్లీ వేడెక్కడంతో మాడుగుల, చోడవరం, నర్సీపట్నం ఎమ్మెల్యేలు అడకత్తెరలో పడుతున్నారని టాక్‌. 9 మండలాల పరిధిలో ఉన్న 163 రెవెన్యూ గ్రామాల్లో 80 వేల మంది నివసిస్తున్నారు. వీరిలో గిరిజనేతలరుకంటే గిరిజనుల జనాభానే ఎక్కువ. రాజకీయ చైతన్యం కలిగిన గ్రామాలు కావడంతో ప్రధాన పార్టీల పోకస్‌ కూడా బాగానే ఉంది. ఎన్నికల సమయంలో ఇక్కడి జనం నాడిని పట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుంటారు నాయకులు. 2004లో తొలిసారిగా సబ్‌ప్లాన్ ఏరియాలోని ఆదివాసీ గ్రామాలను షెడ్యూల్ ప్రాంతంగా మారుస్తామనే రాజకీయ హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినప్పటికీ ఆ హామీ ప్రకటగానే మిగిలిపోయింది. ఆ అంశమే ఇప్పుడు చర్చకు రావడం కలకలం రేపుతోంది.చోడవరం, మాడుగుల, నర్సీపట్నం నియోజకవర్గాలకు వైసీపీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, ముత్యాలనాయుడు, ఉమాశంకర్ గణేష్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సబ్ ప్లాన్ ఏరియాలోని గ్రామాల అభివృద్ధిపై ఇన్నాళ్లూ పెద్దగా చర్చ జరగలేదు. చట్టబద్ధంగా దఖలు పడాల్సిన హక్కుల కోసం గిరిజనులు పెద్దగా ఆరాటపడిందీ లేదు. ఇటీవల జరిగిన పరిణామాలు స్ధానికులకు.. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారాయి. అదే జీవో నెంబర్ 22. విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీని ప్రభుత్వం భారీగా విస్తరించింది. జిల్లాలోని ఏజెన్సీ మండలాలు మినహాయిస్తే దాదాపుగా మిగిలిన ప్రాంతమంతా VMRDA పరిధిలోకి వచ్చి చేరింది. గ్రామీణ ప్రాంతంలో భూముల ధరలకు ఒక్కసారిగా గిరాకీ పెరిగిపోయింది.రియల్ ఎస్టేట్ కంపెనీలన్నీ మండల కేంద్రాలపై దృష్టి పెట్టాయి. మాడుగుల నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో మినహాయిస్తే చోడవరం, నర్సీపట్నంలో భూముల ధరలు గణనీయంగా పెరిగాయి. డిమాండ్ ఆధారంగా ఇక్కడ ఎకరం 25 నుంచి 50లక్షల మధ్య రేటు ఉంది. పైగా షెడ్యూల్ ప్రాంతాలను ఆనుకుని ఉన్న చాలా గ్రామాల్లో దశాబ్దాల క్రితమే భూములు చేతులు మారాయి. ఇక్కడ కొండల్లో మేలు రకం గ్రానైట్‌తోపాటు ఇతర ఖనిజాల తవ్వకాలు జరుగుతున్నాయి. వీటి అనుమతులు పొందేందుకు కాంట్రాక్టర్లు ఇంతకాలం పెద్దగా ఇబ్బందులు ఎదుర్కోలేదు. అలాంటి చోట షెడ్యూల్, నాన్ షెడ్యూల్ సమస్య మొదలైంది.సబ్ ప్లాన్ ఏరియాలో గిరిజన జనాభా ఉన్న పల్లెలు.. తమను షెడ్యూల్ గ్రామాలుగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నాయి. వన్‌ ఆఫ్‌ సెవెంటీ యాక్ట్‌, పీసీ సహా తమ హక్కులను పరిరక్షించే అన్ని చట్టాలను అమలు చేయాలని పట్టుబడుతున్నాయి. ఆ క్రమంలోనే ఎమ్మెల్యేలకు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. భూములు కొనుగోలు చేసిన వారిలో ఎక్కువ మంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు. స్తిరాస్థులు ఏర్పాటు చేసుకుని చాలా సంవత్సరాలైంది. అలాంటి గ్రామాలు ఇప్పుడు VMRDA పరిధికి వచ్చేశాయి. అయితే సబ్‌ప్లాన్‌లోని గిరిజన ప్రాంతాలను షెడ్యూల్ ఏరియాలోకి తేవాలన్న డిమాండ్ ఎటు నుంచి ఎటువైపు తిరుగుతుందోననే ఒత్తిడిలో ఎమ్మెల్యేలు ఉన్నట్టు సమాచారం.మనసులోని మాటను బయట పెట్టలేక ఎమ్మెల్యేలు సతమతం అవుతున్నారట. ఇటీవల ట్రైబల్‌ అడ్వైజరీ కమిటీ సమావేశంలోనూ ఈ అంశంపైనే ఆసక్తికరమైన చర్చ జరిగింది. సబ్‌ప్లాన్‌లో ఉన్న గిరిజన గ్రామాలకు షెడ్యూల్ ఏరియాలో ఉండే అన్ని హక్కులు కల్పించాలని కోరుతూనే ఆ ఒక్కటీ తప్ప అనే కండిషన్ పెట్టారట ఎమ్మెల్యేలు. అదే వన్ ఆఫ్ సెవెంటీ. ఈ చట్టం పరిధిలోకి గ్రామాలు వచ్చేస్తే గిరిజనేతరులు కొనుగోలు చేసిన భూములపై ఆంక్షలు తప్పవు. లావాదేవీలకు ఆస్కారం లేక.. స్తిరాస్థుల విలువ గణనీయంగా పడిపోతుంది. భూముల ధరలు పెరిగినప్పుడు జరిగే అభివృద్ధి ఆంక్షలతో సాధ్యం కాదనే అభిప్రాయం కనిపిస్తోంది. అయితే ఈ మాటలను ఎమ్మెల్యేలు బహిరంగంగా చెప్పలేరు. ఎందుకంటే వారందరికీ సబ్‌ప్లాన్ గ్రామాల మద్దతు కావాలి. అలాగని బయట నుంచి వచ్చి స్థిరపడ్డ గిరిజనేతరులను కాదన లేరు. దీంతో ఈ సమస్యకు మధ్యే మార్గం ప్రభుత్వమే చెప్పాలని పెద్దలను కోరుతున్నారట ఎమ్మెల్యేలు. మరి.. హామీ ఇచ్చి బుక్కైన శాసన సభ్యులు ఈ సమస్యను ఎలా అధిగమిస్తారో చూడాలి.

Related Posts