YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

విశాఖలో టీడీపీకి రివర్స్ షాక్...

విశాఖలో టీడీపీకి రివర్స్ షాక్...

విశాఖపట్టణం, జూలై 29, 
పేరుకు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ. అధినాయకుడి అనుభవం కూడా అంతకు మించే ఉంది. కానీ చేసే పనులు మాత్రం కొత్తవారే బిత్తరపోయేలా ఉంటాయి. వరసగా ఓటమి పాలు అవుతున్నా ఎందుకో టీడీపీ పెద్దలు అసలు ఆలోచించడంలేదు. విశాఖ మహా నగర పాలక సంస్థ ఎన్నికలు జరిగి ఆరు నెలలు అయ్యాయి. నాడు గెలుస్తామని చెప్పి జబ్బలు చరచారు. చంద్రబాబు లోకేష్, వచ్చి రోజుల తరబడి ప్రచారం చేసినా కూడా జనాలు వైసీపీని గెలిపించారు. అయితే ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశం నాడు తెరమీదకు ఒక్కసారిగా రావడంతో ఇండస్ట్రియల్ బెర్ల్ట్ లో టీడీపీకి మేలు జరిగి ముప్పయి వార్డులు అయినా దక్కాయి. లేకపోతే సింగిల్ డిజిట్ అయ్యేది అన్నదే ఒక నిఖార్సు అయిన రాజకీయ‌ విశ్లేషణ.ఇక విశాఖ కార్పోరేషన్ లో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరిగాయి. పది మంది మెంబర్లను ఎన్నుకోవాలి. ఇక్కడ చూస్తే మెజారిటీ అన్నది వైసీపీకి కచ్చితంగా ఉంది. గెలుపు ఖాయం. అయినా సరే టీడీపీ పంతంగా తమ అభ్యర్ధులను పది మందిని బరిలో నిలబెట్టింది. తీరా ఓటింగు వేళకు టీడీపీకి చెందిన కార్పోరేటర్లే ఎక్కువ మంది గైర్ హాజరయ్యారు. వారంతా వచ్చి ఓటేసినా కూడా వైసీపీదే విజయం. అది తెలిసి మరీ పోటీకి పెట్టి పరువు పోగొట్టుకుందని టీడీపీ మీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇక వైసీపీ తరఫున నిలబడిన పది మంది స్టాండింగ్ కమిటీ అభ్యర్ధులకు వైసీపీకి ఉన్న సంఖ్య కంటే కూడా ఎక్కువ ఓట్లు లభించాయి. ఇప్పటికే నలుగురు ఇండిపెండెంట్ కార్పోరేటర్లు వైసీపీలో చేరారు. వారితో కలిపితే బలం 61కి పెరిగింది. కానీ వైసీపీ తరఫున గెలిచిన ప్రతీ అభ్యర్ధికీ 65 ఓట్లు తగ్గకుండా వచ్చాయి అంటే క్రాస్ ఓటింగ్ జరిగింది. అలా టీడీపీ నుంచే ఓట్లు వారికి వచ్చాయని అర్ధం చేసుకోవాలి. ఇక్కడ అధికార పార్టీని దెబ్బ తీసి క్రాస్ ఓటింగుతో తమ వారిని గెలిపించాలని వ్యూహం ప్రకారం టీడీపీ పోటీకి దిగితే అది రివర్స్ లో షాక్ ఇచ్చింది. పైగా టీడీపీ అభ్యర్ధులకు ఒకటి రెండు ఓట్ల కంటే ఎక్కువ పడకపోవడంతో మహా నగరంలో ఆ పార్టీ పరిస్థితి ఏంటో చెబుతోంది.నిజానికి స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో బలం ఎవరికి ఉందో స్పష్టంగా అంకెలు చెబుతున్నాయి. దాంతో వైసీపీకే వదిలేస్తే పరువు దక్కేదని తమ్ముళ్ళు తాపీగా మదనపడుతున్నారు. అయితే ఊరకే ఎందుకు వదలాలని కోరి పోటీకి పెట్టి మరీ మరో పరాభవాన్ని అలా అంటించుకున్నారని కూడా సొంత పార్టీలోనే చర్చ సాగుతోంది. హై కమాండ్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఇలా చేశారు అని కూడా అంటున్నారు. దీని మీద వైసీపీ సీనియర్ నేత, ఎన్నికల పరిశీలకుడుగా వచ్చిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వరులు అయితే చంద్రబాబు మీద నిప్పులే చెరిగారు. బలం లేకుండా పోటీ చేయడమెందుకు అంటూ నిలదీశారు, ఫిరాయింపులు ప్రోత్సహించాలనా అంటూ మండిపడ్డారు. మంత్రి అవంతి శ్రీనివాస్ అయితే చంద్రబాబు తీరు ఎప్పటికీ మారదని కూడా విమర్శలు చేశారు. ఎన్నిసార్లు ఓడినా కూడా టీడీపీ ఇంకా తెగించడం వల్ల క్యాడర్ ఆత్మస్థైర్యమే దెబ్బతింటుందని కూడా కామెంట్స్ పడుతున్నాయి.

Related Posts