YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఆర్ ఎస్ ది రైటా.... రాంగా

 ఆర్ ఎస్ ది రైటా.... రాంగా

హైదరాబాద్, జూలై 29, 
ఇటీవల స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ త్వరలో బహుజన్ సమాజ్ పార్టీలో చేరనున్నారు. ప్రవీణ్ కుమార్ తన రాజకీయ ప్రస్థానాన్ని బీఎస్పీ నుంచి ప్రారంభించనున్నారు. అయితే ఆయన ఎంచుకున్న పార్టీ సరైందా? కాదా? అన్నది చర్చనీయాంశమైంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అధికారిగా బాధ్యతల నుంచి వైదొలిగి ప్రజాప్రతినిధి పాత్రను పోషించాలని భావిస్తున్నారు. అణగారిన వర్గాలను ఆదుకునేందుకు ప్రజాసేవకు మించి మరొకటి లేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భావించారు. అందుకే ఆయనకు ఇంకా ఐదేళ్లు సర్వీస్ ఉండగానే స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తొలుత టీఆర్ఎస్ లో చేరతారని భావించారు. హుజూరాబాద్ నుంచి బరిలోకి దిగుతారని అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరిపోయారు.తెలంగాణలో బీఎస్పీ కి కొంత సానుకూలత ఉండే అవకాశముంది. గతంలోనూ ఇక్కడి నుంచి బీఎస్పీ అభ్యర్థులు గెలుపొందారు. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన మాయావతి నేతృత్వంలో పార్టీ ఉన్నప్పటికీ ముఖ్యంగా అణగారిన వర్గాలు ఈ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయి. ప్రస్తుత మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి 2014 ఎన్నికల్లో నిర్మల్ నుంచి బీఎస్పీ గుర్తుమీదే గెలిచారు. అందుకే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీని ఎంచుకున్నారు. టీఆర్ఎస్ ఇప్పటికే రెండుసార్లు అధికారంలోకి వచ్చింది.కాంగ్రెస్, బీజేపీలు బలంగా లేవు. కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే అవి ప్రభావం చూపే అవకాశాలున్నాయి. ఆ పార్టీలపై ప్రజల్లో నమ్మకం కూడా లేదు. అందుకే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ మూడు పార్టీల వైపు చూడలేదు. విభిన్న రీతిలో రాజకీయాల్లోకి వెళ్లాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భావిస్తున్నట్లు కనపడుతుంది. ఆయనకు ఇప్పటి నుంచే మద్దతు బయట నుంచి లభిస్తుంది. బీఎస్పీలో చేరడం మంచి నిర్ణయమని ఆయనపై సోషల్ మీడియాలో కామెంట్స్ పడుతున్నాయి.

Related Posts