సిడ్నీలో పెరుగుతున్నరోజువారీ కరోనా కేసుల సంఖ్య
మిలటరీ సహాయం కోరిన సిడ్నీ పరిపాలనా యంత్రాంగం
న్యూ ఢిల్లీ జూలై 29
ఆస్ట్రేలియాలో పెద్ద నగరమైన సిడ్నీలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నది. డెల్టా వేరియంట్ విజృంభణతో సిడ్నీ నగరం గత ఆరు వారాలుగా లాక్‌డౌన్‌లో ఉన్నది. లాక్‌డౌన్ పొడిగింపుపై స్థానిక ప్రజల నుంచి నిరసన వ్యక్తమవుతున్నది. మరోవైపు కరోనా వ్యాప్తి తీవ్రత నేపథ్యంలో సిడ్నీ పరిపాలనా యంత్రాంగం మిలిటరీ సహాయం కోరింది. సిడ్నీలో కరోనా హాట్‌స్పాట్‌గా ఉన్న 8 ప్రాంతాల్లో బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేశారు. అలాగే ప్రజలు తమ ఇండ్ల నుంచి 5 కిలోమీటర్ల పరిధిని దాటి రాకూడదని ఆంక్షలు విధించారు. ఇలాంటి కఠిన ఆంక్షలు శుక్రవారం నుంచి అమలు కానున్నాయి. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ నిబంధనల అమలు కోసం సుమారు 300 మిలిటరీ సిబ్బందిని పంపాలని ప్రధానిని కోరినట్లు న్యూ సౌత్ వేల్స్ పోలీస్ కమిషనర్ తెలిపారు