రాష్ట్రపతి తమిళనాడు పర్యటన ఖరారు
చెన్నై
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఐదురోజుల పర్యటన నిమిత్తం ఆగస్టు 2న తమిళనాడు రాష్ట్రానికి రానున్నారు. దిల్లీలో బయలుదేరి మధ్యాహ్నం చెన్నై విమానాశ్రయానికి చేరుకోనున్నారు. సాయంత్రం 5 గంటలకు సెయింట్ జార్జికోటలోని శాసనసభ మందిరంలో దివంగత ముఖ్యమంత్రి కరుణానిధి చిత్రపటం ఆవిష్కరిస్తారు. ప్రత్యేక ప్రసంగం కూడా చేస్తారు. 30 సంవత్సరాల తర్వాత సెయింట్ జార్జికోటకు రాష్ట్రపతి రానుండటం విశేషం. గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ అధ్యక్షతన జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతితోపాటు సీఎం స్టాలిన్, సభాపతి అప్పావు, ఉపసభాపతి పిచ్చాండి పాల్గొంటారు. అనంతరం మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ శతాబ్ది ఉత్సవాల్లో రాష్ట్రపతి పాల్గొంటారు. రాత్రికి రాజ్భవన్లో బస చేయనున్నారు. 3న చెన్నై విమానాశ్రయం నుంచి కోవైలోని సూలూర్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా నీలగిరి (ఊటీ) వెళ్తారు. 4న కున్నూర్ వెల్లింగ్టన్ సైనిక కళాశాల అధికారుల శిక్షణ కేంద్రంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. 5న పర్యాటక ప్రాంతాలను సందర్శించనున్నారు.