YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

రైతన్నకు హమాలీ పోటు

రైతన్నకు హమాలీ పోటు

రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వారు పండించిన పంటలు సేకరిస్తోంది. రైతాంగానికి మద్దతు ధర దక్కేలా చర్యలు తీసుకుంటోంది. ఇంతవరకూ బాగానే ఉన్నా హమాలీ ఛార్జీల చెల్లింపులో మాత్రం సరైన చర్యలు తీసుకోవడంలేదన్న టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే.. అధికారులు హమాలీ సరిగా చెల్లించడంలేదు. దీంతో హమాలీ భారం రైతులపైనే పడుతోంది. సర్కార్  ఏటా లక్ష క్వింటాళ్లకు పైగా రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తోంది. కొనుగోలు సమయంలో రైతులే హమాలీ ఛార్జీలు భరిస్తున్నారు. తర్వాత ప్రభుత్వం చెల్లిస్తుంది. అయితే ఈ చెల్లింపులు పూర్తిస్థాయిలో జరగడంలేదని రైతులు వాపోతున్నారు. ఇదిలాఉంటే హమాలీ చార్జీగా ఒక్క బస్తాకు రూ.5.23 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. అయితే 2012 నుంచి ఇప్పటి వరకు తమ ఖాతాల్లో ఒక్క పైసా జమకాలేదని కర్షకులు అంటున్నారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో 2012 నుంచి సుమారు రూ.10 కోట్ల వరకు హమాలీ ఛార్జీలు రైతులకు ఇవ్వాల్సి ఉంది. కొత్త జిల్లాల ఆవిర్భావం తర్వాత కామారెడ్డి జిల్లాలో రూ.3 కోట్లు రావాల్సి ఉంది. 

ఏటా జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. ఇదంతా బాగానే ఉన్నా ఈ కేంద్రాల్లో హమాలీ ఛార్జీలు, లోడు, తాడు, ఇతరత్రాల ఖర్చులను రైతుల నుంచే వసూలు చేస్తున్నారు. ఇఖ ప్రతి సీజన్‌లో పౌరసరఫరాల సంస్థ హమాలీ ఛార్జీలను సహకార సంఘాలకు విడుదల చేస్తుండగా రైతులకు మాత్రం చేరడంలేదు.  ప్రభుత్వం నిధులు విడుదల చేసిన తక్షణమే సంబంధిత విభాగాలకు నగదు మళ్లిస్తున్నామని పౌరసరఫరాల విభాగం అధికారులు చెప్తున్నారు. మరోవైపు రైతులు మాత్రం నాలుగేళ్లుగా పైసా చేతికి రాలేదని స్పష్టం చేస్తున్నారు. ఇటు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు మాత్రం తమకు నగదు రాలేదని చెప్తున్నారు. దీంతో భారీ స్థాయిలోనే అవకతవకలు సాగి ఉంటాయని అంతా అనుమానిస్తున్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులు దృష్టి సారించి లబ్ధిదారులకు హమాలీ చార్జీలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Related Posts