YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం దేశీయం

అంజనాద్రే ఆంజనేయుని జన్మస్థలం

అంజనాద్రే ఆంజనేయుని జన్మస్థలం

అంజనాద్రే ఆంజనేయుని జన్మస్థలం
- అనేక పురాణాల్లో ఈ విషయం స్పష్టంగా ఉంది
- పురాణాలు అక్కర్లేదనే వారు ఈ విషయం గురించి మాట్లాడకూడదు
అంతర్జాతీయ వెబినార్ లో పలువురు స్వామిజీలు, పండితులు 
తిరుమల జూలై 30
 తిరుమల లోని అంజనాద్రి పర్వతమే ఆంజనేయ స్వామి వారి జన్మస్థలమని వాల్మీకి రామాయణం లో స్పష్టంగా ఉందని శ్రీ కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరీ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదని, వివాదం అవసరమే లేదని చెప్పారు.
    టీటీడీ శ్రీ వేంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ ఆధ్వర్యంలో హనుమంతుని జన్మస్థలం అంజనాద్రి అనే అంశంపై శుక్రవారం జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం లో రెండురోజుల అంతర్జాతీయ వెబినార్ ప్రారంభమైంది.

      ఈ కార్యక్రమంలో భారతీ మహాస్వామి  దృశ్య మాధ్యమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కృత యుగంలో వృషాద్రి, త్రేతాయుగంలో అంజనాద్రి, కలియుగంలో వెంకటాచలంగా పిలవబడుతోందని చెప్పారు.బ్రహ్మాండ పురాణంలో ఈ విషయం ఉందన్నారు. దీంతో పాటు అనేక పురాణాల్లో అంజనాద్రి ఆంజనేయుని జన్మస్థలమని పేర్కొన్నట్లు స్వామి వివరించారు. కిష్కింధకు శాస్త్ర, పురాణ ప్రమాణాలు లేవని స్వామి చెప్పారు. సంస్కృతం, పురాణం, శాస్త్రాలు తెలియని వారికి ఇలాంటి విషయాల గురించి మాట్లాడే అర్హత ఉండదని అన్నారు.
    టీటీడీ కార్యనిర్వహణాధికారి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అధ్యక్షోపన్యాసం చేశారు. తాను ఈవో గా బాధ్యతలు తీసుకున్న రెండు నెలలకే అంజనాద్రి హనుమంతుని జన్మస్థలమని, ఈ విషయం గురించి ఆలోచించాలని పలువురు మెయిల్స్ ద్వారా సూచనలు చేశారని చెప్పారు. దీనిపై తాను పలువురు ప్రముఖ పండితులతో మాట్లాడితే ఇందుకు తగిన ఆధారాలు ఉన్నాయని వారు వివరించారన్నారు. వీటిపై నమ్మకం కుదిరాకే 2020 డిసెంబరు లో పండిత పరిషత్ ఏర్పాటు చేసినట్లు ఈవో తెలిపారు. ఈ పరిషత్ పురాణ, ఇతిహాస, భౌగోళిక, పురావస్తు అంశాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశోధించి అంజనాద్రి హనుమంతుని జన్మస్థలమని నిర్ధారణ చేసిందన్నారు. జార్ఖండ్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర లో ఆంజనేయుని జన్మ స్థలాలుగా అక్కడి వారు నమ్ముతున్న ప్రాంతాలను కూడా పండిత పరిషత్ పరిశీలించిందన్నారు. శ్రీరామ నవమి సందర్భంగా పండితులు ఆధారాలతో సహా ఈ విషయం ప్రకటించడంతో పాటు బుక్ లెట్ కూడా విడుదల చేశామని చెప్పారు. ఈ అంశాన్ని సశేషంగానే ఉంచి, ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలు, సూచనలు ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు. ఒకరిద్దరు అభ్యంతరాలు తెలపడానికి వస్తే చర్చ పెట్టామని, వారు మాట్లాడిన భాష, వ్యవహరించిన తీరు చాలా అభ్యంతర కరంగా ఉండటంతో వారితో ఇక మాట్లాడలేదన్నారు. అవసరమైతే మరోసారి సమావేశం నిర్వహిస్తామన్నారు.
    మహీంద్రా  విశ్వవిద్యాలయం న్యాయ కళా శాల డీన్ శ్రీ మాడభూషి శ్రీధర్ మాట్లాడుతూ, రామాయణాన్ని కూడా అనుమానించే యుగంలో మనం ఉన్నామన్నారు. రామాయణం జరిగిందనడానికి ధనుష్కోటి లోని రామసేతు వంతెనలాంటి అనేక ఆధారాలు ఉన్నాయన్నారు. తిరుమల అంజనాద్రి ఆంజనేయుని జన్మస్థలమని టీటీడీ తీసుకున్న పురాణ ఆధారాలు చాలా బాగాఉన్నాయన్నారు. 2007లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటి ముద్రించిన హనుమాన్స్ కేం అనే పుస్తకంలో కూడా అంజనాద్రే ఆంజనేయుని జన్మస్థలమని రాసారని చెప్పారు. టీటీడీ కంటే కొన్ని దశాబ్దాల ముందే చాలామంది ఈ విషయం రాశారని ఆయన తెలిపారు.
    జాతీయ సంసృత విశ్వవిద్యాలయం ఉప కులపతి , టీటీడీ పండిత పరిషత్ అధ్యక్షులు ఆచార్య వి.మురళీధర్ శర్మ  మాట్లాడుతూ, అంజనాద్రే ఆంజనేయుని జన్మస్థలమని నిర్ధారించడానికి పండిత పరిషత్ పరిశోధన ప్రపంచానికి తెలియాలనే వెబినార్ నిర్వహిస్తున్నామని చెప్పారు. పురాణాలు లేక పోతే భారతీయతే లేదన్నారు. ఈ విషయంపై అందరి అభిప్రాయాలు సేకరించి సమగ్ర పుస్తకం ముద్రిస్తామని అన్నారు.
     జీవా డైరెక్టర్ ఆచార్య సముద్రాల రంగ రామానుజాచార్యులు మాట్లాడుతూ, అంజనాద్రిలో ఆంజనేయుడు జన్మించారని అనేక పురాణాల్లో ఉందన్నారు.  ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు. వెంకటాచల మహాత్యం, వెంకటాచలం ఇతిహాసమాల, తిరుమల సమయాచారముల పుస్తకాలు ప్రతిఒక్కరు చదివితీరాలని అన్నారు.
     పూణె దక్కన్ కాలేజి ప్రాజెక్టు డైరెక్టర్ ఆచార్య వెంపటి కుటుంబరావు శాస్త్రి, పురాణాలు ప్రామాణికం కాదంటే భారతీయతను నరుక్కున్నట్లే నని చెప్పారు. పురాణాలు ప్రామాణికం కాదనే వారి వాదనలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.

Related Posts