YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

దాహం..దాహం..

దాహం..దాహం..

వేసవి వచ్చిందంటే తెలంగాణలో తాగునీటికి సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. ఈ ఇబ్బందులు తొలగించేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నా పెద్దగా ఫలితం ఉండడంలేదని ప్రజలు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ముందస్తు కార్యాచరణ కొరవడడంతో ఏటా తాగునీటికి తిప్పలు పడాల్సి వస్తోందని వాపోతున్నారు. ఇదిలాఉంటే కరీంనగర్ లో తాగునీటికి సమస్యలు ఏర్పడతాయని వేసవికి ముందే వార్తలు వినిపించాయి. మండు వేసవి సమయంలో తాము సమస్యల్లో కూరుకుపోకుండా చర్యలు తీసుకోవాలని అప్పట్లోనే విజ్ఞప్తి చేశారు. అయితే భూగర్భ జల మట్టాలు పాతాళానికి చేరడంతో అధికారులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఇతర ప్రాంతాల నుంచి నీరు తీసుకొచ్చి ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాల్సి ఉన్నా ఆపని కూడా సజావుగా సాగడంలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏదైమైనా బోర్లు, బావుల్లో నీరు అడుగంటడం సమస్యాత్మకంగా ఉంది. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో వ్యవసాయ బావుల వద్దకు వెళ్లి నీరు తెచ్చుకుంటున్నారు. 

 

మిషన్‌ భగీరథ ద్వారా నీటిని జలాశయాల నుంచి రక్షిత నీటి పథకాల రిజర్వాయర్ల వరకు పంపించాలన్న ప్రయత్నాలు ఇంకా నెరవేరలేదు. దీంతో తాగునీటి కోసం ప్రజలు సతమతమవుతున్నారు. జిల్లాలోని పలు గ్రామాలతో పాటు పట్టణాల్లోనూ నీటి సమస్య తీవ్రంగానే ఉంది. తాగునీటి ఇబ్బందులు తొలగించేందుకు అధికారులు ప్రణాళికలు పంపినా నిధులు ఆశించినమేర అందలేదు. దీంతో నీటి సమస్య కొనసాగుతోంది. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదని, తక్షణమే యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడితే సమస్య పరిష్కారం అవుతుంది. జిల్లాలో 15 మండలాలు ఉన్నాయి. పలు మండలాల పరిధిలో తాగునీటి సమస్య అధికంగా ఉంది. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా అద్దె బావుల ద్వారా తాగునీరు అందిస్తున్నా.. సమస్య పరిష్కారం కావడంలేదు. రోజురోజుకు భూగర్భ జలాలు అడుగంటడంతో తీవ్రత పెరుగుతూనే ఉంది. తాగునీటి ఎద్దడి తీరాలంటే మిషన్ భగీరథను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని అంతా కోరుతున్నారు. అయితే పలు ప్రాంతాల్లో పైప్ లైన్లు లీకవుతున్నాయి. దీంతో ఇప్పట్లో తాగునీటి సమస్య పరిష్కారమయ్యే సూచనలు కనిపించడంలేదు.  

Related Posts