మోదీ సర్కార్ చేతుల్లో భద్రంగా లేని దేశ సరిహద్దులు
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు
న్యూఢిల్లీ జూలై 31
అసోం-మిజోరాం సరిహద్దు వివాదం, వాస్తవాధీన రేఖ వెంబడి పరిస్థితుల వ్యవహారంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. మోదీ సర్కార్ చేతుల్లో అటు దేశ సరిహద్దులు కానీ ఇటు రాష్ట్ర సరిహద్దులు కానీ భద్రంగా లేవని ఆరోపించారు. ఈ అంశంపై కాషాయ పార్టీ ప్రభుత్వం తీరును రాహుల్ తీవ్రంగా తప్పుపట్టారు. రెండు ఈశాన్య రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం చిలికిచిలికి గాలివానగా మారడంతో జులై 26న అల్లర్లకు దారితీయడంతో ఆరుగురు అసోం పోలీసులు, ఓ పౌరుడు మరణించగా 50 మందికి పైగా గాయాలయ్యాయి. అసోం-మిజోరం సరిహద్దుల్లో అల్లర్లు చెలరేగిన ప్రాంతంలో పెద్దసంఖ్యలో సీఆర్‌పీఎఫ్ బలగాలు మోహరించినా ఇంకా పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. అసోం బారక్ వ్యాలీ జిల్లాలు కచర్, కరీంగంజ్, హిలాల్‌కండీలు మిజోరాంలోని ఐజ్వాల్, కొలసిబ్, మమిత్ జిల్లాలతో సరిహద్దు ప్రాంతం విస్తరించి ఉంది.